సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మహిళలను అణచివేతకు గురిచేసే సాంప్రదాయాలను నిర్మూలించాల్సినన్న ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ద్రవిడ నాయకులు పెరియార్, మాజీ ముఖ్యమంత్రులు సిఎం అన్నాదురై, ఎం కరుణానిధి అభిప్రాయాలనే తాను వ్యక్తీకరించానని ఉదయనిధి తెలిపారు. గతంలో మహిళలకు చదువుకోవడానికి అనుమతి లేదు. వారు ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కాదు. భర్త చనిపోతే వారు కూడా సతీసహగమనం చేసుకునేవారు. వీటన్నిటి వ్యతిరేకంగా పెరియార్ మాట్లాడారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి అభిప్రాయాలనే నేను కూడా మాట్లాడాను అని ఉదయనిధి స్పష్టం చేశారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వ్యాధులను పోలిస్తూ దీన్ని వ్యతిరేకిస్తే సరిపోదు, నిర్మూలించాల్సిందేనంటూ పిలుపునిచ్చారు. కాగా..ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బిజెపి, ఇతర హిందూ సంస్థల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉదయనిధిపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే నా వ్యాఖ్యలను వక్రీకరించారు. తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా అనేక కోర్టులలో నాపై కేసులు దాఖలయ్యాయి. క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు. అయితే..నా మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. నేను కళైజ్ఞర్(కరుణానిధి) మనవడిని. క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు. అన్ని కేసులను ఎదుర్కొంటాను అని ఉదయనిధి ప్రకటించారు.
తమిళనాడులో హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర గీతంలో ఇటీవల జరిగిన మార్పులు ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన దూరదర్శన్ తమిళ కార్యక్రమంలో ఆలపించిన రాష్ట్ర గీతం నుంచి కొన్ని పదాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆయన చెప్పారు. తమిళనాడు ప్రజలు తమ పిల్లలకు అందమైన తమిళ పేర్లను పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.