వెబ్ డెస్క్: సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన డిఎంకె నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం తాను తన వైఖరి నుంచి తగ్గడం లేదనడానికి సూచనగా సోషల్ మీడియాలో ఒక మస్కిటో కాయిల్ ఫోటోను పోస్టు చేశారు.
అయితే ఈ ఫోటోకు ఆయన ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అదేవిధంగా ఎటువంటి కామెంట్ పోస్టు చేయలేదు. అయితే సనాతన ధర్మంపై గత వారం తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం నేపథ్యంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ సూచించే విధంగా ఆయన ఈ ఫోటో పోస్టు చేశారు.
గతవారం చెన్నైలో జరిగిన సనాతన నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ కొన్ని విషయాలను వ్యతిరేకించడంతో సరిపోదని, వాటిని నిర్మూలించాల్సిందేనని అన్నారు. డెంగీ, డోమలను, మలేరియాను లేక కరోనాను వ్యతిరేకిస్తే సరిపోదని, వాటిని నిర్మూలించాల్సిందేనని ఆయన అన్నారు. ఇప్పుడు సనాతనను నిరూల్చాలని ఆయన అన్నారు.
— Udhay (@Udhaystalin) September 11, 2023
ఈ వ్యాఖ్యలపై బిజెపి తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన డిఎంకె నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఇరుకున పెట్టేందుకు బిజెపి ప్రయత్నించింది. హిందూ మతాన్ని ఇండియా కూటమి అవమానిస్తోందంటూ బిజెపి ఆరోపించింది.