చెన్నై: తమిళనాడు అధికార పార్టీ డిఎంకె యువజన కార్యదర్శి, ఎంఎల్‌ఎ ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఉదయనిధి స్టాలిన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి, ఎస్‌పిఐ విభాగంతోపాటు పేదరిక నిర్మూలన కార్యక్రమ బాధ్యతలు నెరవేర్చను న్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం విలేఖరుల సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలు విమర్శకు తన పనితీరుతో సమాధానం చెపుతాను అని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమానికి స్టాలిన్‌తోపాటు ఆయన కేబినెట్ సహచరులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఆవరణలోని సచివాలయంలో సీనియర్ మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూతో కలిసి ఉదయనిధి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ రవి, అన్బిల్ మహేశ్, ఈవి వేలు, వి సెంథిల్ బాలాజీ ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఉదయనిధి స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డిఎంకె మిత్రపక్షం కాంగ్రెస్ సభ్యులు కూడా ఉదయనిధికి అభినందనలు తెలిపారు.
అయితే ప్రధాన ప్రతిపక్షం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. అధికార డిఎంకె పార్టీ కుటుంబ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఉదయనిధి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు అన్నాడిఎంకె ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మంత్రుల పోర్ట్‌ఫోలియాల్లో మార్పు చేశారు. సీనియర్ మంత్రి పెరియసామి తన సహకార శాఖను గ్రామీణాభివృద్ధి శాఖగా మార్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా విలేఖరులతో మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఇకనుంచి తను సినిమాల్లో నటించను అని వెల్లడించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మామన్నాన్ చిత్రమే చివరి చిత్రమని ఈ సినిమా 2023లో విడుదల అవుతుందని ఉదయనిధి వెల్లడించారు.