చెన్నై: తన కుమారుడు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంగళవారం సూచనప్రాయంగా వెల్లడించారు. అదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ పునర్వవస్థీకరణ ఉంటుందని కూడా ఆయన సూచించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఉదయనిధి స్టాలిన్‌కు పదోన్నతిపై ఊహాగానాలు సాగుతున్న విషయాన్ని ఆయన వద్ద విలేకరులు ప్రస్తావించగా ఈ విషయంలో నిరాశ ఉండదని, మార్పు ఉంటుందని స్టాలిన్ వెల్లడించారు.
మరో ప్రశ్నకు బదులిస్తూ ఈశాన్య రుతుపవనాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో చర్చలు జరిపి తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీచేశారని ఆయన తెలిపారు. ఇటీవల జరిపిన అమెరికా పర్యటనలో సాధించిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండును గురించి ప్రశ్నించగా పరిశ్రమల మంత్రి టిఆర్‌బి రజా ఇదివరకే ఒక ప్రకటన జారీచేశారని, దాన్నే శ్వేతపత్రంగా పరిగణించాలని స్టాలిన్ చెప్పారు. స్టాలిన్ తన అమెరికా పర్యటనలో 18 కంపెనీలతో రూ.7,616 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు.
సెప్టెంబర్ 14న తన అమెరికా పర్యలన ముగించుకుని తిరిగివచ్చిన స్టాలిన్ త్వరలోనే క్యాబినెట్ పునర్యవస్థీకరణ ఉంటుందని సూచించారు. కాగా, డిఎంకె యువజన విభాగానికి కార్యదర్శిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. తనను ఉప ముఖ్యమంత్రిగా నియమించడంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి స్టాలిన్‌దేనని సెప్టెంబర్ 18న ఉదయనిధి విలేకరులకు తెలిపారు. మరుసటి రోజున తమిళనాడు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసన్ విలేకరులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి నియామకం అనివార్యమని స్పష్టం చేశారు.