మన వచ్చే ఏ డాదంతా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధితో సుభిక్షంగా విరాజల్ల్లుతోందని, గణనీయ ఫలితాలు, అద్భుత శుభాలు కల్గుతాయ ని ప్రముఖ వేద పండితులు సంతోష్‌కుమార్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సుస్థిర పాలన అందుతోందని, ప్రజాహిత కార్యక్రమాలు, పథకా లు చక్కటి ఫలితాలతో పాటు కొన్ని ఆశ్చర్యకర ఘటనలు చూడబోతున్నామని, ఏడాదిలో ప్రజలకి ఆనందదాయకంగా ఉంటుందన్నారు. బుధవారం రవీంధ్రభారతిలో దేవదాయశాఖ, సాంస్కృతిక విభాగం పక్షాన శోభకృత్ నామ ఉగాది వేడుకల్లో భాగంగా సంతోష్ కుమార్ శర్మ చేత పంచాంగ పఠనం ఘనంగా జరిగింది. శుభకృత్ ఎడాది ప్రజలకు అన్ని విధాలా శుభాన్ని కల్గిస్తోందన్నారు.
రాష్ట్రంలో సాగు పరంగా రైతే రాజుకి పట్టం కట్టబోతున్నామని, పంటల ఉత్పత్తి గణనీయంగా పురోగతి సాధిస్తోందని, అన్నదాతలకు గిట్టుబాటు ధర ఈ సంవత్సరం మంతా లభిస్తోందని, పాడి పంగలతో రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకుసాగుతోందని వివరించారు. ఈ సంవత్సరం వర్షాల కోసం ఎదురుచూడకుండా రాష్ట్రంలో ప్రధాన నీటి ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధ్దిగా ఉంటుందని, నీటి సమస్యకు డోకా ఉండబోదన్నారు. ప్రపంచ దేశాల మద్య శత్రుత్వం తగ్గి.. స్నేహ భావాలు పెరుగుతాయని, ఈ ఏడాదిలో సామాజికి ఉద్రిక్తతలు, మత విద్వేషాలు పెచ్చరిల్లే అవకాశాలున్నాయని, రాజులు తగు జాగ్రత్తగా ఉండాలి, ఆందోళన కల్గించే విపరీత ధోరణులను పాలకులు నియంత్రణ చర్యలతో అణచివేస్తారని ఆయన పేర్కొన్నారు.
ప్రసార మాధ్యమాల పనితీరు బాగుంటుందని, ఈ రంగం బ్రహ్మాండమైన అత్యున్నతంగా పనిచేస్తారని, విజ్ఞానం, పరిశోధనలకు పెరిగి సమాజంలో సమూలమైన మార్పులు సంభవిస్తాయని ఆయన చెప్పారు. ఈ సీజన్‌లో భానుడు ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుందని, ఆలానే రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి.. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, శుభ కార్యాలు, ఆర్భాటాలు, వినోదాలు పెరిగిపోతాయని వెల్లడించారు.న్యాయ వ్యవస్థ తీరు బాగుంటుందని, సుప్రీంకోర్టు, హైకోర్టులు చక్కటి తీర్పులు ఇవ్వబోతున్నాయని సంతోష్ కుమార్ శర్మ వివరించారు. సమాజం సుభిక్షంగా ఉండేందుకు యాగాలు, యజ్ఞలు, పూజాదికాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఏడాది పాటు ఉంటాయని చెప్పారు.
సమాజంలో మహిళల ఆధిపత్యం ధోరణలు పెరుగుతాయని, స్త్రీలు చెప్పినట్లు పురుషులు నడుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, బల్దియా డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళభరణం కృష్ణామోహన్ రావు, బిఆర్‌ఎస్ గోషామహల్ నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.