Wednesday, January 22, 2025

తెలుగువారి తొలి పండుగ ఉగాది

- Advertisement -
- Advertisement -

 

 

శ్రీ శోభకృత్ నామ  సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ
తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. హిందూ
సంప్రదాయంలో పండుగలన్నీ దైవారాధనతో
జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఉగాది మాత్రం కాలాన్ని స్వాగతించే పండుగ. కొత్త ఆలోచనకు, కొత్త ఆచరణకు,
కొత్త లక్షానికి, కొత్త యుగానికి ఆరంభం ఉగాది.

ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మసమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారంతో సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఈ రోజే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే. మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుభాళిస్తూ, పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే ప్రారంభమవుతుంది. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు ‘గుడి పడ్వా’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పాయ్‌లా బైశాఖ్’, తమిళులు ‘పుత్తాండు’ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.

షడ్రుచుల సమ్మేళనం
ఈ పండక్కి మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. కొత్త చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు, అరటిపండ్లు మొదలైన పదార్థాలను ఉపయోగించి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట
సుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెబుతుందీ పచ్చడి.

ఉగాది రోజున ఏం చేయాలంటే…
ఉగాది పండగను ఎలా జరుపుకోవాలన్నదానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. పెద్దవారితో నువ్వుల నూనెను తలమీద పెట్టించుకుని, నలుగుపిండితో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పరగడుపునే ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు.

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ అయిదు అంగాల కలయికనే పంచాంగం అంటారు. మనకు పదిహేను తిథులు, ఏడు వారాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, ఇరవై ఏడు యోగాలు, పదకొండు కరణాలు ఉన్నాయి. వీటన్నింటి గురించీ పంచాంగం వివరిస్తుంది. వీటితోపాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలూ, ధరలూ, వర్షాలూ, వాణిజ్యం… ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరూ, అందువల్ల కలిగే లాభనష్టాలు ఏమిటీ వంటి విషయాలతోపాటు దేశ స్థితిగతులను కూడా పంచాంగంలో ప్రస్తావిస్తారు.

Ugadi is first Festival of Telugu people
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News