Wednesday, January 22, 2025

శోభకృత్‌కి స్వాగతం, సుస్వాగతం

- Advertisement -
- Advertisement -

‘ఉగాది’ తెలుగువారి తొలి పండుగ. చైత్రమాసంలో వచ్చేమొదటి రోజుని ఉగాది అని, సంవత్సరాది అని, యుగాది అని పిలుస్తుంటారు. ‘యుగం’ అంటే ‘యోగం’. మనిషి బతుకు కాలంతో ముడిపడి ఉండటమే యోగం. అలా యోగానికి తొలినాడు కావడం వల్ల ‘యుగాది’ అని కూడా పిలుస్తుంటారు ఈ పండుగని. అలాగే శ్రీ ‘ప్రభవ’ నామ సంవత్సరం నుండి ‘అక్షయ’ నామ సంవత్సరం వరకు సంవత్సరం ప్రారంభం రోజుని కూడా ‘ఉగాది’ లేదా ‘యుగాది’ అంటాము. శరదృతువులో ఆకులన్నీ రాలిపోయి మోడులైన చెట్లను చిగురింపచేసి తిరిగి కొత్త జీవనమైన వసంత రుతువు ప్రారంభమవుతుంది.

ఈ వసంత రుతువు లో పక్షుల కిలకిలారావాలు, కోయిలల కుహూ కుహూ రాగాలతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నూతన ఉగాదికి స్వాగతం పలుకుతాయి. అలాగే ప్రకృతి కూడా ప్రశాంత చిత్తంతో పిల్లగాలుల్ని వీస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలా ప్రకృతి సైతం పరవశించే ఈ ఉగాది పండుగ వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభి నుంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మపుట్టాడు. కొంత కాలానికి బ్రహ్మ, విష్ణువును తనతో పాటు ఉండమని కోరాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్లు ఉన్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇస్తాడు. ఇదే దేవుని మొదటి విగ్రహంగా చెబుతారు. ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేస్తున్న బ్రహ్మ ఆ తర్వాత కొంత కాలానికి సూర్యునికి ఆ విగ్రహాన్ని ఇస్తాడు.

సూర్యుడు తన కొడుకైన మనువుకు ఇస్తాడు. మనువు తన కొడుకైన ఇక్ష్వాకునికి ఇస్తాడు. అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాత విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకుంటాడు. అయితే లంకకి తీసుకు వెళ్ళే దారిలో విభీషణుడు దానిని పొరపాటున నేలపై పెడతాడు. దాంతో ఆ విగ్రహం అక్కడే పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం అని, ఆ స్వామి వారే శ్రీరంగనాథ స్వామి వారని పురాణ గాథ. ఈ సంఘటన కూడా ఉగాదినాడే సంభవించింది. అందుకే ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగని తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, సింధి రాష్ట్రాలలో కూడా ఘనంగా చేసుకుంటారు. చాంద్రమానం ప్రకారం చైత్రమాసంతో ప్రారంభమై ఫాల్గుణమాసం పూర్తయ్యే సంవత్సరానికి మొదలు ఈ రోజు చంద్రుడు వివిధ నక్షత్రాలలో సంచరించే స్థితిని బట్టి దీనిని చాంద్రమానం అంటారు. ‘ఉగం అంటే నక్షత్ర గమనం ప్రకారం ఏడాదిని ‘ఉంగం’ గాను దాని తొలిదినాన్ని ‘ఉగాది’ గాను వ్యవహరిస్తారు.

అదే విధంగా రెండు ఆయనాలు ఉన్న సంవత్సరం ‘యుగం’ అంటారు. తెలుగు వారి నమ్మకం ఏమిటంటే ఈ ఉగాది రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈరోజున ప్రాతఃకాలమున లేచి లోగిళ్ళని శుభ్రపరచుకుని రంగవల్లులు తీర్చిదిద్ది మామిడి తోరణాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. అందరూ తలస్నానం చేస్తారు. తలకి నూనె రాసుకుని తల స్నానం చేయడంలో ఆంతర్యం ఏమిటో చూడండి. పర్వదినాల్లో తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారు. అందుకే పర్వదినాల్లో తలకు నూనె రాసుకుని తలస్నానం చేస్తే లక్ష్మీ, గంగా మాతల అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెబుతారు. తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి తినడంతో దినచర్య ప్రారంభిస్తారు. షడ్రుచుల సమ్మేళనాలతో కూడిన ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం.

ఈఆరు రుచులలో మధురమైన ‘తీపి’ సంతోషానికి తిక్త అయిన, ‘చేదు’ బాధకి, కటువుగా ఉండే ‘కారం’ కోపానికి, లవణంగా పిలువబడే ‘ఉప్పు’ భయానికి ఆమ్లాలు కలిగిన ‘పులుపు’ చిరాకుకు, కషాయం లాంటి ‘వగరు’ ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు. ఇలా ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. మనకి సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి- చెడులను, కష్ట-సుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఈ పచ్చడి కోసం చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం.. మొదలగునవి వాడతారు. ఈరోజున జగమంతటికీ తలిదండ్రులైన శివపార్వతుల్ని దర్శిస్తే చాలా మంచిది. గోపూజ, ఎద్దుపూజలు కూడా చేస్తారు.గోవులకు ప్రదక్షిణ చేస్తే విశిష్టమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున పంచాంగాన్ని పూజామందిరంలో పెట్టి పూజచేయాలి.

పంచాం గం అంటే అయిదు అంగములు కలిగినది అని అర్థం. అవి ‘తిధి, వార, నక్షత్ర, కరణ, యోగములు’. ఈ పంచాంగంలో సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకొని గ్రహాల కనుగుణంగా శుభ, అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యం, అవమానం ఎంతమేర ఉంటుంది అనే విషయాలన్నీ వారివారి రాశుల ఆధారంగా చాలా వివరంగా తెలియచేయబడతాయి. మనం భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆయన అనుగ్రహించి తీవ్ర ఫలితాలను ఇవ్వకుండా కరుణా కటాక్షాలను చూపుతాడు. అలాగే పంచాంగాన్ని పండగ రోజున మాత్రమే కాకుండా ఐదింటిని అంటే ‘తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాల్ని’ ప్రతిరోజు పరిశీలన చేస్తే ‘సంపద, దీర్గాయువు, ఆరోగ్యం, విజయం, పాపనాశనం’ ఈ ఐదు సంప్రాప్తిస్తాయి. పంచాంగంలోని ఫలితాలను చదువుకొని కలిసొచ్చే కాలం అయితే ఏ విధమైన అహం కృతిని పొందకుండా దానిని భగవంతుని లీలగా భావించి సమతుల్యమైన బుద్ధితో వుండాలి. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి వుందని పంచాంగంలో చెబితే ఏమాత్రం దిగులు చెందకుండా భగవంతుని పూజి స్తే మన బాధలు తొలగిపోతాయి. అలాగే ఈ ఉగాదిని ప్రతి సంవత్సరం జరుపుకుంటాము.

ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ పేర్లు రావడం వెనుక కూడా ఓ చిన్న కథ ఉంది. శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన ‘సుదీపని’ అని అనే రాజకుమారికి అరవై మంది సంతానం. వారి పేర్లనే ఈ తెలుగు సంవత్సరాలకి పెట్టారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి అని పరమేశ్వరుడు వరం ఇవ్వడంతో ప్రతి యుగానికి ఇవే పేర్లు వస్తున్నాయి. ఈ ఏడాది ఉగాది పేరు శోభకృత్ నామ సంవత్సరం. ఈ శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభం నుంచే మనకి ఉన్న కష్టాలు, బాధలు పూర్తిగా తగ్గిపోయి శుభప్రదంగా అందరి జీవితాలు సాగిపోతూ అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు. ‘మామిడి పూత వచ్చింది’ కోకిల గొంతుకి కూత వచ్చింది, వేపపువ్వు కొమ్మకి పూత వచ్చింది, గుమ్మానికి పచ్చని తోరణాలు వచ్చాయి, శుభం పలుకుతూ శోభకృత్ నామ సంవత్సరం మన ముంగిట్లోకి వచ్చింది..’ అంటూ ఇలా ఎన్నో అందమైన కవితలకి జీవం పోస్తు ‘శోభకృత్’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ ఉగాది పండుగ అరుణోదయ కాంతులతో, ప్రకృతి మాత పిల్లగాలుల హొయలతో, వసంత మాసపు కోయిలమ్మ అందమైన కుహు రాగాలతో అడుగిడుతున్న శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ… శ్రేయోభిలాషులందరికీ శోభకృత్ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News