పపువా న్యూ గినియాపై 3 వికెట్ల తేడాతో విజయం
గయానా : టి20 వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఉగాండ నయా చరిత్రను నెలకొల్పింది. గురువారం పపువా న్యూ గినియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఉగాండ చారిత్రక గెలుపును అందుకుంది. స్లో పిచ్‌పై జరిగిన ఈమ్యాచ్‌లో న్యూగినియాపై ఉగాండ పైచేయి సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో కేవలం 77 పరుగులకే చాపచుట్టేసింది. న్యూ గినియా బ్యాటర్లలో హిరి హిరి(15), లెగా సియాకా(12), కిప్లిన్ డొరిగా(12) మాత్ర మే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. ఇక ఉగాం డ బౌలర్లలో అల్పేష్ రంజానీ, కాస్మస్, జుమా మియాగీ, ఫ్రాంక్ న్సుబుగా తలో రెండు వికెట్లు పడగొట్టగా. మసాబ్ ఒక వికెట్ తీశాడు. కాగా, 43 ఏళ్ల న్సుబుగా నాలుగు ఓవర్లలో కేవలం 4 పరుగులే ఇచ్చి న్యూ గినియా నడ్డీ విరిచాడు. అంతేకాదు అతను వేసిన నాలు ఓవర్లలో రెండు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి.
తడబడిన ఉగాండ..
అనంతరం లక్ష ఛేదనలో ఉగాండ 18.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అయితే ఉగాండ 1/1, 6/2, 6/3, 25/4, 26/5తో వరుసగా వికెట్లుగా కోల్పోయింది. ఓ దశలో పపువా గెలుస్తుందనే అనుకున్నారంతా. అయితే ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన జుమా మియాగీ (13)తో కలిసి రియాజత్ అలీషా (33) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో రియాజత్-మియాగీ ఆరో వికెట్‌కు 35 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. ఇక చివరలో కెన్నెత్ (7) పొరపాటు చేయకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు.