ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత
న్యూఢిల్లీ: ఉగాండ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఒక మహిళ శరీరం నుంచి 535 గ్రాముల హెరాయిన్ నింపిన 49 క్యాప్సూల్స్‌ను, 175 గ్రాముల కొకైన్ నింపిన 15 క్యాప్సూల్స్‌ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 3 కోట్లు ఉంటుందని, ఈ డ్రగ్స్‌ను ఆ మహిళ శరీరంలోనుంచి బయటకు తీసేందుకు బైకుల్లాలోని జెజె ఆసుపత్రిలో ఆమెను చేర్చినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. ఉగాండ నుంచి వస్తున్న మహిళ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు కచ్ఛితమైన సమాచారం అందడంతో మే 28న ఆమెను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దుస్తుల్లో కాని, లగేజ్‌లో కాని ఎటువంటి డ్రగ్స్ లభించలేదని, ఆయితే ఆమె తన శరీరంలోపల వాటిని దాచి ఉండవచ్చన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని ఆ అధికారి చెప్పారు. జెజె ఆసుపత్రిలో ఆమెను చేర్పించి అక్కడ ఆమె శరీరంలోనుంచి డ్రగ్స్ క్యాప్సూల్స్ బయటకు తీసినట్లు ఆయన చెప్పారు.