Monday, December 23, 2024

మాతృభాషల్లో పరీక్షలు!

- Advertisement -
- Advertisement -

ఒక దేశం, ఒక భాష సిద్ధాంతాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ పాలనలో విద్యార్థులు తమ మాతృభాషల్లో లేదా స్థానిక భాషల్లో పరీక్షలు రాయడానికి అనుమతించడం విశేషమే. దేశంలోని అన్ని భాషల ప్రాధాన్యతను తగ్గిస్తూ అందరి పైనా హిందీని రుద్దాలనే యోచన గట్టిగా కలిగిన కమలనాథులకు ప్రాంతీయ భాషల మీద మక్కువ కలగడం ఆశ్చర్యకరమూ, ఆనందదాయకం కూడా. ఆంగ్ల మాధ్యమంలో చదివే వారు సహా విద్యార్థులందరూ పరీక్షలను సొంత భాషల్లో రాయడానికి అవకాశమివ్వాలని బుధవారం నాడు విశ్వవిద్యాలయ గ్రాంట్ల కమిషన్ (యుజిసి) దేశంలోని యూనివర్శిటీలన్నింటినీ కోరింది. స్థానిక భాషల్లోకి అనువాదాలను ప్రోత్సహించాలని కూడా సూచించింది.

బోధన, నేర్చుకోడం, మూల్యాంకనం స్థానిక భాషల్లో చేపడితే అయా కోర్సుల్లో విద్యార్థుల చేరిక క్రమక్రమంగా పెరిగి కృతార్థత కూడా మెరుగుపడుతుందని యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ దేశంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లందరికీ రాసిన లేఖలో పేర్కొన్నారు. విద్యలో దేశ భాషలను క్రమం తప్పకుండా వినియోగించడం నూతన విద్యా విధానం 2020 లక్షమని ఆయన వివరించారు. అయితే ఇది ఆచరణలో ఎంత వరకు సాధ్యమవుతుంది అనేది సమగ్రంగా పరిశీలించవలసిన కోణం. దేశంలో రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో చేర్చిన గుర్తింపు పొందిన 22 భాషలున్నాయి. అదే సమయంలో అసంఖ్యాక మాతృభాషలున్నాయి.

దేశంలోని వివిధ పాఠశాలల్లో 47 భాషలను బోధనా భాషలుగా వినియోగిస్తున్నారని 2017లో జరిపిన ఒక అధ్యయనం తెలియజేస్తున్నది. నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నట్టు తొలి బాల్యం నుంచే పిల్లలకు వారి మాతృభాషలో నేర్పడం వల్ల వారు నేర్చుకోడంలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థులు పాఠశాలల్లో చేరడం మెరుగుపడుతుందని, అలాగే పరీక్షల్లో తప్పడం కూడా తగ్గుతుందని ఇండియా స్పెండ్ అనే సంస్థ ప్రపంచమంతటా జరిపిన ఒక అధ్యయనం నిగ్గు తేల్చినట్టు సమాచారం. అయితే దీనిని సాధించాలంటే దేశంలో ప్రస్తుత మున్న విద్యా వ్యవస్థ సరిపోదని, కొత్త పుస్తకాలు, సరికొత్త ఉపాధ్యాయ శిక్షణ అవసరమని అందుకోసం అపారంగా నిధులు ఖర్చు చేయాల్సి వుంటుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో బహు భాషలు వుండడం వల్ల, అలాగే యాసలు కూడా అసంఖ్యాకం కావడం వల్ల ఈ బోధన ఆచరణలో కష్టతరమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

సొంత భాషల్లో నేర్చుకోడమనేది ఇప్పటికే అనేక చోట్ల అమల్లో వుంది. ఆంగ్లం బదులుగా మాతృభాషలను బోధనా మాధ్యమాలను చేసిన చోట అనేక కారణాల వల్ల విద్యార్థుల అధ్యయన నాణ్యత దెబ్బతిన్నదనే అభిప్రాయం నెలకొన్నది. వారు చదువులు ముగించుకొన్న అనంతరం ఉద్యోగాల వేటలో పోటీని తట్టుకోలేకపోతున్నారనే నిర్ధారణకు వస్తున్న సందర్భాలు లేకపోలేదు. దేశంలో బోధనా మాధ్యమాలతో నిమిత్తం లేకుండా బోధన అనేదే అవసరమైనంత నాణ్యతను ఇప్పటికీ సంతరించుకోలేదు. స్థానిక, ప్రాంతీయ, మాతృభాషనైనా సవ్యంగా రాయగల, పలకగల నైపుణ్యం విద్యార్థుల్లో చోటు చేసుకోడం లేదు. బోధించే ఉపాధ్యాయులకు చేతకాకపోడం కూడా ఇందుకొక కారణం. అలాగే పాఠ్య గ్రంథాలను ఆయా వయసుల వారి స్థాయిని బట్టి కాకుండా ఉన్నత ఆదర్శాలను సాధించడమే లక్షంగా రూపొందిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతున్నది. అందువల్ల విద్యార్థులు ముఖ్యంగా అణగారిన కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్న మెజారిటీ విద్యార్థులు ఆ పాఠ్య గ్రంథాలను చదవలేక వాటి ఆధారంగా రూపొందించే ప్రశ్న పత్రాలకు సమాధానాలు చెప్పలేక దెబ్బ తింటున్నారు, న్యూనతకు గురి అవుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బాగా చదువుకొనే విద్యార్థులు మాతృభాషలో పరీక్షలు రాయడానికి ఎంత వరకు ఇష్టపడతారు అనేది కూడా కీలకమైన ప్రశ్నే.

ఇక అనువాదాలది అతి పెద్ద సమస్య. ఆంగ్లంలో వుండే పాఠ్యగ్రంథాలను నిర్దుష్టంగా స్థానిక లేదా మాతృభాషల్లోకి అనువదించడం అనుకున్నంత సుళువు కాదు. అనువాదం సవ్యంగా లేకపోతే విద్యార్థులు అసలు విషయాన్ని గ్రహించలేక తీవ్రంగా నష్టపోతారు. వారి భవిష్యత్తు నాశనమైపోతుంది. స్థానిక లేదా మాతృభాషల్లో పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడం మొత్తం విద్యార్థి లోకానికి ఆహ్లాదం కలిగిస్తుంది. కాని నిజంగానే సొంత భాషల్లో జవాబు పత్రం రాయాల్సి వచ్చేటప్పటికి వారు ఎంత వరకు విజయవంతమవుతారో చెప్పలేము. మూల్యాంకనం చేసేటప్పుడు సొంత భాషల్లో సమాధానం రాసే వారి పట్ల ప్రత్యేకాభిమానం చూపించడం జరగదు. విద్యార్థులను చదువులకు ప్రోత్సహించడం కోసం ఇటువంటి ఏర్పాట్లు చేసినందు వల్ల ప్రయోజనాలు పాక్షికంగానే సిద్ధిస్తాయి గాని, పరిపూర్ణ ఫలితాలు లభించవు. అందుచేత నాణ్యమైన పాఠ్యగ్రంథాలు, సమర్థులైన ఉపాధ్యాయులు, సర్వసమగ్రమైన ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మీద ముందుగా దృష్టి పెట్టవలసిన అవసరం వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News