Monday, December 23, 2024

యుజిసి నూతన కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) న్యూఢిల్లీ, దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలని నియంత్రణ, నిధులు, పర్యవేక్షణ చేసే అత్యున్నత జాతీయ సంస్థ. నూతన విద్యా విధానం -2020 ప్రకారం దేశంలో నూతన విద్యా సంస్కరణలకు అనుగుణంగా నేడు విశ్వవిద్యాలయ నిధుల సంఘం పలు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని దేశంలో పలు జాతీయ సంస్థలు, యూనివర్సిటీలకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇటీవల యుజిసి పలు నిర్ణయాలు తీసుకొని అమలు చేయమని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

యుజిసి ప్రవేశపెట్టిన పలు విధానాలు ఉత్సహ్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, ఇసమాధాన్ లాంటి ఇ -గవర్నెన్స్ నూతన పద్ధతులు కాకుండా ఇతర సంస్కరణలు అధ్యాపకులకు, పరిశోధక విద్యార్థులకు, విద్యార్థులకు సులభంగా, సరళంగా, సౌకర్యంగా ఉన్నాయి. ఉన్నత విద్యలో పరివర్తన వ్యూహాలు పలు చర్యలను చేపట్టడం కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ‘ఉత్సహ్’ (ఉన్నత విద్యలో పరివర్తన వ్యూహాలు, చర్యలను చేపట్టడం) అనే పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు అంతటా దాని వ్యూహాత్మక కార్యక్రమాల అమలును సమర్థవంతంగా ట్రాక్ చేస్తుంది, వాటికి మద్దతు ఇస్తుంది. ఈ పోర్టల్ ఉన్నత విద్యలో గుణాత్మక సంస్కరణల కోసం యుజిసి కార్యక్రమాల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.

జాతీయ విద్యా విధానం 2020 పరిశ్రమల, ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చడానికి నైపుణ్యం -ఆధారిత విద్యపై దృష్టి సారించడం ద్వారా ఉన్నత విద్యను మార్చడానికి ప్రయత్నిస్తున్నది. జాతీయ విద్యా విధానం సాధారణ విద్యతో వృత్తి విద్యను సమగ్రపరచాలని, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశ్రమ- అకాడెమియా సహకారాన్ని బలోపేతం చేయాలని కూడా సిఫార్సు చేస్తుంది. ఈ దిశగా, ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ అనే కొత్త కేటగిరీ పొజిషన్ల ద్వారా పరిశ్రమల, ఇతర వృత్తిపరమైన నైపుణ్యాన్ని విద్యా సంస్థల్లోకి తీసుకురావడానికి నేడు కొత్త చొరవ తీసుకుంది. ఇది వాస్తవ ప్రపంచ అభ్యాసాలను, అనుభవాలను తరగతి గదుల్లోకి తీసుకు వెళ్లడానికి, ఉన్నత విద్యా సంస్థలలో అధ్యాపక వనరులను పెంపొందించడానికి సహాయపడుతుంది. ప్రతిగా సంబంధిత నైపుణ్యాలతో కూడిన శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ల నుండి పరిశ్రమలు, సమాజం రెండు ప్రయోజనం పొందుతాయి.

నిర్ణీత కాల వ్యవధిలో పలు రంగాలలో కృషి చేసిన వారి సేవలు వినియోగించుకోవడం వల్ల విద్యార్థులు పరిశ్రమలు ఇతర వృత్తులలో ప్రావీణ్యం సాధిస్తారు. దీని వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది కానీ యూనివర్సిటీలో ఆయా రంగాల్లో నిపుణులను జాగ్రత్తగా ఎంపిక చేయాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. నేడు, దేశంలో కొన్ని వివిధ జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల మైనింగ్ విభాగంలో ఇద్దరు సింగరేణి ఉద్యోగులు ప్రొఫెసర్లుగా నియమించబడ్డారు. వివిధ వాటాదారుల (విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది) సమస్యలు, ఆందోళనలను పరిష్కరించడానికి యుజిసి వివిధ యంత్రాంగాలను తీసుకొని వచ్చింది. సింగిల్ విండో సిస్టమ్ అందుబాటులో లేనందున వాటాదారులు వివిధ చోట్ల అనేక ఫిర్యాదులు చేస్తున్నారు.

దాని కారణంగా పరిష్కార యంత్రాంగాలు నెమ్మదిగా ఉన్నాయి, ఇది వాటాదారులకు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇన్‌స్టిట్యూషనల్ ఎంటిటీ గ్రీవెన్స్‌ల పరిష్కారం ఎల్లప్పుడూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంది కాబట్టి, ‘ఇ-సమాధాన్ ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిజిస్టరింగ్, మానిటరింగ్ సిస్టమ్’ తో ముందుకు వచ్చింది. ఇది ఫిర్యాదులు/ ఫీడ్‌బ్యాక్/ ప్రశ్నలను గుర్తించి దరఖాస్తు చేసుకోవడానికి వాటాదారులకు ఉండే ఒక డిజిటల్ ప్లాట్ ఫారమ్. ఈ ప్లాట్ ఫారమ్ ఫిర్యాదుల పరిష్కారానికి కాలపరిమితి గల యంత్రాంగాన్ని నిర్ధారిస్తుంది.దీని వల్ల దేశంలోని పలు విశ్వవిద్యాలయంలో, కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించే విధంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో పలు ఉన్నత విద్య సంస్థల్లో నమోదు చేయబడినటువంటి ఫిర్యాదులు పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయాయి. ఇటువంటి జాతీయ పోర్టల్ ద్వారా దేశంలోని విద్యాసంస్థల్లో ఉన్నటువంటి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని యుజిసి పేర్కొంది.

దేశంలోని పలు జాతీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి అధ్యాపక నియామకాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటు వంటి ఆన్‌లైన్ పోర్టల్ సి.యు- చయాన్‌ని ఇటీవల యుజిసి ప్రారంభించింది. ఈ కామన్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దేశంలోని అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఖాళీలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంలో త్వరగా నియామకాలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడంలో, పారదర్శకతకు సంబంధించినటు వంటి అంశాలలో ఆశావాహులకు మరింత సులభంగా ఉండడానికి ఈ పోర్టల్ దోహదపడుతుంది. జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎబిసి) దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో ఒక ప్రోగ్రామ్ నుండి తగిన ‘క్రెడిట్ ట్రాన్స్‌ఫర్’ మెకానిజంతో చదువుకునే స్వేచ్ఛతో విద్యార్థుల అకడమిక్ మొబిలిటీని సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. ఇది డిగ్రీ/ డిప్లొమా/ పి.జి- డిప్లొమా మొదలైన డిగ్రీలు సాధించడానికి దారి తీస్తుంది. ఎబిసి రిజిస్టర్డ్ సంస్థలు అందించే క్రెడిట్‌లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తుంది.

అకడమిక్ బ్యాంక్ క్రెడిట్(లు) విద్యార్ధి నుండి నేరుగా కాకుండా సంస్థల నుండి మాత్రమే భాగస్వామ్యం చేయబడతాయి. ఎబిసి ద్వారా నిల్వ, ధ్రువీకరణ కోసం ఆధీకృత సంస్థ సమర్పించిన క్రెడిట్‌లు మాత్రమే ఆమోదించబడతాయి. ఈ విధానంలో క్రెడిట్‌ల సమగ్రతను ఉంచడానికి, వాటిని నిర్వహించడానికి విద్యాసంస్థలను అనుమతిస్తుంది. అలాగే విద్యార్థి క్రెడిట్‌ల ప్రామాణికత, గోప్యతను కాపాడుతుంది. ఎబిసి విద్యార్థులకు బహుళ ప్రవేశం, బహుళ నిష్క్రమణలను అనుమతిస్తుంది. అంటే వివిధ దశల్లో ఒక కోర్సు నుండి ఎగ్జిట్ కావొచ్చు, నచ్చినప్పుడు దానిని పూర్తి చేయవచ్చు. పాఠ్యప్రణాళిక రూపకల్పన, అభివృద్ధికి మరింత సౌకర్యవంతమైన విధానాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది.

భారత దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేసేలా పలు మార్గదర్శకాలు యుజిసి విడుదల చేసింది. విదేశీ యూనివర్సిటీల ఏర్పాటు వల్ల విదేశీ విద్యార్థులతో సహకార పరిశోధన లేదా విద్యా కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి మన దేశ విద్యార్థులకు సహాయపడుతుంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యావేత్తలు అనేకమంది ఉన్నారు. వారు తమ స్వంత విశ్వవిద్యాలయాలలో బోధించడానికి భారతదేశానికి రావచ్చు. ఇది దేశంలో ఉన్నత విద్య స్థాయిని మెరుగుపరుస్తుంది. ఇది చర్చల దశలో ఉంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు భారతదేశంలో పని చేయడానికి సులభతరం చేయబడతాయని నూతన విద్యా విధానం పేర్కొం ది.

విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటు ఇందుకోసం ఉపయోగపడుతుందని విద్యవేత్తల అభిప్రాయం. ఈ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థులు సరసమైన ఖర్చుతో విదేశీ అర్హతలను పొందేలా చేస్తుంది. భారతదేశాన్ని ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుస్తుంది. ఈ నిబంధనలు భారతదేశంలోకి విదేశీ ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని యుజిసి ముసాయిదా పేర్కొంది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్) అనేది న్యూఢిల్లీలో విద్యా మంత్రిత్వ శాఖ క్రింద పని చేస్తున్న ఒక వినూత్న సెల్. ఇది అన్ని అంశాలపై ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించడానికి, తదుపరి పరిశోధన, సామాజిక అనువర్తనాల కోసం భారత దేశ విజ్ఞాన విధానాన్ని సంరక్షించడానికి, వ్యాప్తి చేయడానికి స్థాపించబడింది. ఏది ఏమైనప్పటికీ జాతీయ నూతన విద్యా విధానం విజయవంతంగా అమలు చేయడానికి యుజిసి పలు సంస్కరణలు ఎల్లప్పుడూ తీసుకుంటూ దేశంలోని విద్యా విధానాన్ని మార్చే క్రమంలో యుజిసి తన వంతు పాత్రను కూడా సక్రమంగా నిర్వహిస్తుంది.

అదే విధంగా భారతదేశంలో పరిశోధనలకు శాస్త్ర విజ్ఞాన సంబంధించినటువంటి శాస్త్రాల అభివృద్ధికి భారతీయ విజ్ఞాన విధానాన్ని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి మరిన్ని నిధులను జాతీయ ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ విడుదల చేయాల్సినటువంటి అవసరమే ఎంతైనా ఉంది. చివరగా విశ్వవిద్యాలయ నిధుల సంఘం కేవలం నిధులకు సంబంధించినటువంటి నియంత్రణ సంస్థగా కాకుండా దేశంలోని విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే ఒక మార్గదర్శక, పర్యవేక్షణ సంస్థగా నేడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పనిచేస్తున్నటువంటి తీరు అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నూతన సంస్కరణను అందరికీ ఆమోదయోగ్యంగా సులభతరంగా ఉండేటువంటి పలు విధానాలను ప్రవేశపెట్టి ఉన్నత విద్యలో భారతదేశం మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కోరుకుందాం.

డా. కందగట్ల
శ్రవణ్ కుమార్
8639374879

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News