Wednesday, January 22, 2025

జననానికీ, మరణానికీ ఆధార్

- Advertisement -
- Advertisement -

UIDAI plans to link Aadhaar with birth-death

మరో రెండు పైలట్ ప్రాజెక్టులకు ఉడాయ్ ప్లాన్

న్యూఢిల్లీ : దేశం లోని సుమారు 130 కోట్ల మందికి వేర్వేరుగా కేటాయించిన 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ పరిధిని మరింత విస్తరించాలని భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్ ) యోచిస్తోంది. పుట్టిన వారితోపాటు , మరణించిన వారి వివరాలనూ ఆధార్‌కు లింక్ చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ రెండు పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని ఉడాయ్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్టు ఎకనమిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా నవజాత శిశువులకు బయో మెట్రిక్ వివరాలు తీసుకుని ఆమేరకు శాశ్వత ఆధార్ కార్డు ను జారీ చేయనున్నారు. ఇంటి వద్దకే వెళ్లి ఈ వివరాలు నమోదు చేయనున్నారని అధికారి వెల్లడించారు. 18 ఏళ్ల తరువాత మరోసారి బయోమెట్రిక్ వివరాలు రీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల బహుళ ఐడీలను జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదని, పైగా చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాల నుంచి దూరం కాలేరని సదరు అధికారి తెలిపారు.

ప్రస్తుతం ఐదేళ్ల లోపు చిన్నారుల ఆధార్ వివరాలు సేకరిస్తున్నప్పటికీ వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోవడం లేదు. దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో తక్కువ సంఖ్యలో మాత్రమే ఆధార్ నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో ఉడాయ్ ఈ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మరో వైపు భారత పౌరుడిగా ఆధార్ తీసుకుంటున్నప్పటికీ ఎవరైనా చనిపోతే ఆ వివరాలు ఉడాయ్ వద్ద నమోదు కావడం లేదు. దీంతో ఇప్పటికీ ఆధార్ నంబర్ కలిగిన వ్యక్తి పేరుతో పెన్షన్ అందుకుంటున్నారని , దీనివల్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగమవుతున్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో చాలా మంది మరణించినా వారి వివరాలేవీ ఉడాయ్ దగ్గర లేవు. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరణాల వివరాలు తీసుకోనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News