Monday, December 23, 2024

కోలాహలంగా లష్కర్ బోనాలు

- Advertisement -
- Advertisement -

భక్త జనసంద్రమైన ఉజ్జయిని
మహంకాళి ఆలయ పరిసరాలు
బంగారు బోనం సమర్పించిన
ఎంఎల్‌సి కవిత ప్రభుత్వం
తరఫున పట్టువస్త్రాలు అందజేసిన
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మన తెలంగాణ/సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర భక్తుల కోలాహలం మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలు సమర్పిచేందుకు పెద్దఎత్తున భక్తులు ఆలయం వద్దకు తరలివచ్చారు. డప్పుల దరువులు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తొలి బోనం ఉదయం ఐదుగంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీగా ఆలయ ప్రాంగణానికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానగరానికి పెద్ద ఆశీర్వాద ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. దక్షిణాదిలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయని, అవి తగ్గుముఖం పట్టాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచించినట్లు తెలిపారు.

వరదల వచ్చి ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని, పంటలు, ప్రాణనష్టం కలగకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అమ్మవారిని సందర్శించుకుని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా బారీక్లేడు, మంచినీరు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చూశారని వెల్లడించారు. తరువాత అమ్మవారికి ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు బోనాలు ఎంతో పేరుగాంచాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని, ఎలాంటి కష్టాలు వచ్చిన అమ్మ కాపాడుతుందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఉజ్జయిని మహంకాళిని దర్శించేందుకు కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారి కరుణ కటక్షాలతో మనమంతా సుఖంగా ఉన్నామని, తల్లి కృప రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో పండగలు ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డి.కె.అరుణ, గీతారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మానిక్ ఠాకూర్, బిఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయం వద్ద హడావుడి చేసిన రేవంత్‌రెడ్డి

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి పిసిసి చీప్ రేవంత్‌రెడ్డి ఆలయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బారీకేడ్లను తోసుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల హంగామా లేకపోవడంతో దిక్కుతోచక అధికారులపై విరుచుకపడ్డారని ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లిన రాజకీయ చేయడం తప్ప మరొకటి లేదని మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News