మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ మహిళలకు బహుమతిగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై సబ్సిడి మార్చి 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంపై ఎంపి లక్ష్మణ్ హర్షం వ్యక్తంచేశారు. అంతే కాకుండా ఉజ్వలేతర గ్యాస్ సిలిండర్లపై కూడా రూ.100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన అంశమని తెలిపారు. ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తికి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు.
మహిళలంతా గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజా ఆరోగ్య విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంఘ సేవకురాలుగా, కంప్యూటర్ ఇంజనీర్‌గా జీవితాన్ని ప్రారంభించి అనేక అనాథాశ్రయాలను స్థాపించి అభాగ్యులను ఆదుకుంటున్నారన్నారు. అలాగే గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం స్త్రీ శక్తికి మోడీ ఇచ్చిన ప్రోత్సాహమని కొనియాడారు.