Tuesday, December 24, 2024

‘ఉజ్వల’ ఊతం ఉత్త గ్యాస్!

- Advertisement -
- Advertisement -

కట్టెల పొగల పొయ్యలతో ఉసూరుమనే గృహిణులకు ఆ పొగ కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం కింద సబ్సిడీపై వంట గ్యాస్ కనెక్షన్లు అందించడమే ప్రధాన లక్షం. 2016 మే 1న ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలో ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. యుపిఎ ప్రభుత్వానికి మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతటి ప్రతిష్ఠాత్మకమైందో, మోడీ ప్రభుత్వానికి ఈ ఉజ్వల పథకం అంతటి ప్రతిష్ఠాత్మకమే అన్న విశ్వాసాన్ని కలిగించారు. 2019 జనవరి నాటికి ఉజ్వల లబ్ధిదారులు 6 కోట్ల మంది అయ్యారు. వీరిలో 26 శాతం మంది ప్రభుత్వ రుణసదుపాయం వినియోగించుకోలేదు. తమ స్వంత జేబుల్లోంచి ఖర్చుపెట్టి కొనుక్కున్నారు.

ఈ పథకం కింద 2020 మార్చి నాటికి 8 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ కాగా, అదనంగా మరో కోటి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలన్న లక్షంతో 2020 21 లో ఉజ్వల యోజన 2.0 ప్రారంభమైంది. అంటే ఇప్పటికి మొత్తం 9 కోట్లకు పైగా కనెక్షన్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల్లో 74 శాతం మందికి గ్యాస్ స్టౌ, రీఫిల్లింగ్‌కు డబ్బులు వెచ్చించే స్తోమత లేనందున వారికి చమురు కంపెనీలు రుణం కల్పిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మిగిలిన 26 శాతం మంది లేదా 1.56 కోట్ల మంది లబ్ధిదారులు ప్రభుత్వ రుణసౌకర్యానికి అర్హత లేని వారేనన్న అర్థం వస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎల్‌పిజి కనెక్షన్ల కోసం వన్‌టైమ్ గ్రాంటు కింద ప్రభుత్వం రూ. 1600 అందించింది. లబ్ధిదారులు ఎవరైతే 14.2 కిలోల సిలిండర్‌ను పొందారో వారికి రూ.1600 వరకు, 5 కిలోల సిలిండర్‌కు రూ.1150 వంతున నగదు సహాయం కల్పించారు. ఇందులో 14.2 కిలోల సిలిండర్‌కు సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1250 కాగా, 5 కిలోల సిలిండర్‌కు రూ.800 సెక్యూరిటీ డిపాజిట్. రెగ్యులేటర్‌కు రూ.150, ఎల్‌పిజి గొట్టానికి రూ.100, గ్యాస్‌కార్డుకు రూ.25, కనెక్షన్ ప్రారంభానికి ఛార్జి రూ. 75 వంతున దేనికది కేటాయించి ఉచితంగా అందించారు. 12 సిలిండర్ల వరకు ప్రతి గ్యాస్ సిలిండర్‌కు రూ.200 వంతున సబ్సిడీ చెల్లించేవారు. ఇదంతా రివాల్వింగ్ ఫండ్ ద్వారా చమురు కంపెనీలు లబ్ధిదారులకు రుణ సౌకర్యంగా అందించాలని ప్రభుత్వం సూచించింది.

ఈ రుణ మొత్తం ప్రతీ రీఫిల్లింగ్ తరువాత లబ్ధిదారునికి వచ్చే సబ్సిడీ నుంచి రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం పూర్తిగా రికవరీ అయిన తరువాత వినియోగదారుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా సబ్సిడీ జమ అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏటా రూ. 1234. 71 కోట్ల రుణ వార్షిక సగటు భారాన్ని మోయవలసి వస్తోంది. సబ్సిడీ చెల్లింపుల కోసమే బడ్జెట్‌లో రూ. 4000 కోట్లు కేటాయించవలసి వస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో 2020 మే నుంచి ఇటీవల వరకు ప్రభుత్వం సబ్సిడీ చెల్లింపులు ఆపేసింది. గ్రామీణ కుటుంబాలు తమ నెలసరి సంపాదనలో 10 శాతం ఈ గ్యాస్ కనెక్షన్లకే ఖర్చు పెడుతున్నారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు ధర రూ.450 ఉండగా, ఇప్పుడు దాదాపు రూ.1100 కు చేరుకుంది. లబ్ధిదారుల్లో 54.2 శాతం మంది ఏడాదిలో మూడు అంతకన్నా ఎక్కువ సిలిండర్లను వినియోగిస్తున్నారు.

కనీసం నలుగురు ఉన్న కుటుంబం ఏటా మూడు నుంచి నాలుగైనా సిలిండర్లు వాడవలసి వస్తుంది. లబ్ధిదారుల్లో తక్కువ ఆదాయం ఉన్నవారు నిరంతరం పెరుగుతున్న ధరలతో కొనుక్కోలేని పరిస్థితి వెంటాడుతోంది. పైగా మరో పెద్ద సమస్య సిలిండర్ రీఫిల్లింగ్. ఏటా ప్రతి గ్యాస్ కనెక్షన్‌కు 3.66 రీఫిల్స్ జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2019 నాటికే దాదాపు1.20 కోట్ల మంది లబ్ధిదారులు తమ ఎల్‌పిజి సిలిండర్లను రీఫిల్లింగ్ చేసుకోలేకపోయారని తేలింది. కానీ కేంద్ర పెట్రోలియం మంత్రి 2019 ఆగస్టు 1 న పార్లమెంట్ వేదికగా 80 శాతం మంది రీఫిల్లింగ్ చేసుకున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోంది. కానీ అదే పార్లమెంట్‌లో ఒడిశాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ 201617లో 26.83 శాతం మంది మాత్రమే రెండోసారి రీఫిల్లింగ్ చేయించుకున్నారని వెల్లడించారు. ఈ సంఖ్య 2017 18 నాటికి మరింత దిగజారి కేవలం 21.16 శాతం మంది మాత్రమే రెండోసారి రీఫిల్లింగ్ చేయించుకున్నారు. కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా) ఈ పథకం తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.

రూ. 12,800 కోట్ల వ్యయంతో కూడిన ఈ పథకంలో ఏటా 1.93 కోట్ల లబ్ధిదారులు మాత్రమే సరాసరిన కేవలం 3.55 రీఫిల్లింగ్ చేయించుకుంటున్నారని, అదే 2018 డిసెంబర్ 31 నాటికి 3.18 కోట్ల లబ్ధిదారులు ఏటా 3.21 రీఫిల్లింగ్ చేయించుకున్నట్టు పేర్కొంది. చమురు కంపెనీలు అందజేసిన కనెక్షన్ల వివరాలు పరిశీలిస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సంబంధించి గత ఏడాది 65 లక్షల కనెక్షన్లు రీఫిల్ కాలేదు. హెచ్‌పిసిఎల్ కనెక్షన్లు 9.1 లక్షలు, బిపిసిఎల్ కనెక్షన్లు 15.90 లక్షలు రీఫిల్ కాలేదు. ఉజ్వల కనెక్షన్లు అమర్చడంతో కలుపుకుని మొత్తం రీఫిల్స్ 40 కోట్లకు పైగా విస్తరించాయని, 87 శాతం మంది రెండో రీఫిల్లింగ్ చేయించుకున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. 2019 సెప్టెంబర్ వరకు ఉజ్వల మొదటి దఫాలో 15.96 లక్షల వరకు బిపిఎల్ కనెక్షన్లు పంపిణీ కాగా, ఐఒసిఎల్ కనెక్షన్లలో 52 లక్షలు, హెచ్‌పిసిఎల్ కనెక్షన్లలో 27.58 లక్షలు, బిపిసిఎల్ కనెక్షన్లలో 28.56 లక్షలు మాత్రమే ఒకసారి రీఫిల్ అయ్యాయి.

ప్రపంచ స్థాయిలో ధరలు పెరగడం, ప్రభుత్వం సబ్సిడీ కేటాయింపు ఆపేయడంతో 202122 లో 90 లక్షల మంది లబ్ధిదారులు ఒక్కసారి కూడా గ్యాస్ సిలిండర్లు రీఫిల్లింగ్ చేసుకోలేకపోయారు. ఇక తమ ఆదాయంలో అంతమొత్తం వెచ్చించలేక దాదాపు 7.7 లక్షల మంది లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్ విడిచిపెట్టి 5 కిలోల సిలిండర్ వాడడం ప్రారంభించారు. కొత్త లబ్ధిదారుల కోసం 8.1 లక్షల 5 కిలోల సిలిండర్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అందించాయి. ఇక ఇప్పట్లో ఎల్‌పిజికి ప్రత్యామ్నాయం లేదన్న సంగతి తెలిసిందే. ఈ పథకం వల్లనే దేశం మొత్తం మీద ఇళ్లల్లో వాయు కాలుష్యం తగ్గుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదికలో వెల్లడించాయి. అయితే ఇందులో ఎన్ని కుటుంబాలు ఎల్‌పిజి సిలిండర్లను వినియోగిస్తున్నాయో, ఎన్ని సిలిండర్లు ఏటా రీఫిల్లింగ్ అవుతున్నాయో డేటా లేదు. అయితే ఆరోగ్యపరంగా గృహిణుల బతుకులు మెరుగుపడే అవకాశం మాత్రం ఈ పథకం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ మేరకు గ్రామీణ గృహిణుల బతుకులు మెరుగుపడేలా దీనిపై అవగాహన పెంపొందించినప్పుడే ఎల్‌పిజి వినియోగం వైపు వారు మొగ్గు చూపగలుగుతారు.

ఇప్పటికే చాలా మంది గ్రామీణ మహిళలు ఈ సిలిండర్ల సమస్యలు పడలేక తిరిగి కట్టెల పొయ్యిలనే వాడుతున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆ అలవాటును మాన్పించాలంటే ప్రభుత్వం ఉజ్వల పథకంలో తగిన రాయితీలు మరిన్ని కల్పించాల్సి ఉంది. అలాగే లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా ఎల్‌పిజి ధరలు తగ్గిస్తే ఏటా రూ. 33,000 కోట్లు వరకు ఖర్చవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఉజ్వల పథకంతో సంబం ధం లేని గ్యాస్ వినియోగదారులకు సహాయంగా 2002 21 మధ్య కాలంలో ప్రభుత్వం ఏటా రూ. 20,000 కోట్ల వరకు వెచ్చించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

అంతమొత్తం వారికి వెచ్చించినప్పుడు ఉజ్వల లబ్ధిదారులకు కాస్త ఎక్కువైనా నిధులు వెచ్చించడంలో అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ లబ్ధిదారులకు గత ఐదేళ్లలో ఏటా కేవలం రూ. 3500 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చుపెట్టగలిగింది. ఇక గ్యాస్ కనెక్షన్ల కేటాయింపు, సరఫరా విషయంలో మొదటి నుంచి న్యాయపరమైన చిక్కులను పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్‌జిఆర్‌బి) ఎదుర్కొంటోంది. 2019 ఫిబ్రవరి నాటికి దేశం మొత్తం మీద 228 కేంద్రాల్లో పంపిణీ కేంద్రాలను నెలకొల్పి 70 శాతం జనాభాకు గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించారు. 2020 ఏప్రిల్ నుంచి 2029 వరకు ఏటా 2 మిలియన్ గ్యాస్ పైపు కనెక్షన్లు నగర ప్రాంతాలకు ఇవ్వడానికి సన్నాహాలు జరిగాయి. దేశం మొత్తం మీద 3500 సిఎన్‌జి ఫిల్లింగ్ స్టేషన్లు నెలకొల్పి, 58,000 కిమీ పొడవునా పైపు లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని అనుకున్నారు. 2030 నాటికి ఇంధన వినియోగంలో సహజవాయువు వాటాను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని లక్షంగా పెట్టుకున్నారు. కానీ ఇవన్నీ ప్రతిపాదనలు గానే మిగిలిపోతున్నాయి.

కె. యాదగిరి రెడ్డి
9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News