ఓ బస్టాప్‌లో యుకె రక్షణశాఖ రహస్యాలు..!!
ఆఫ్ఘన్‌లో కొనసాగనున్న బ్రిటీష్ దళాలు..?
లండన్: యుకె రక్షణశాఖకు చెందిన రహస్య పత్రాలు ఆ దేశ ఆగ్నేయ ప్రాంతంలోని ఓ బస్టాప్‌లో ఓ వ్యక్తికి దొరికినట్టు ఆ దేశ మీడియా సంస్థ వెల్లడించింది. ఆ రహస్య పత్రాలు ఉక్రెయిన్ జలాల్లో ఇటీవల సంచరించిన బ్రిటన్ యుద్ధ నౌకకూ, ఆ దేశ మిలిటరీకి సంబంధించినవిగా మీడియా పేర్కొన్నది. రహస్య పత్రాలు కొన్నింటిలో ఉక్రెయిన్ జలాల్లో సంచరించిన హెచ్‌ఎంఎస్ డిఫెండర్, దానిపై స్పందించిన రష్యా నావీకి సంబంధించిన అంశంపై విశ్లేషణ ఉన్నది. మరికొన్ని పత్రాల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు వైదొలిగితే, వాటి స్థానంలో యుకె దళాల కొనసాగింపునకు సంబంధించిన చర్చ ఉన్నట్టు మీడియా పేర్కొన్నది. తమ దళాల స్థానంలో బ్రిటన్ దళాలను ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగించాల్సిందిగా అమెరికా కోరినట్టు ఆ పత్రాల్లో ఉన్నది. గత వారం ఆ రహస్య పత్రాలను తమ ఉద్యోగి ఒకరు పోగొట్టినట్టు తమకు సమాచారమిచ్చారని యుకె రక్షణశాఖ ధ్రువీకరించింది. కెంట్‌లోని ఓ బస్టాప్ వెనుక ఓ వ్యక్తికి ఆ రహస్య పత్రాలు దొరికాయని మీడియా తెలిపింది. రహస్య పత్రాల సున్నితత్వం దృష్టా మిగతా వివరాల్ని వెల్లడించడంలేదని మీడియా పేర్కొన్నది. ఈ పత్రాల గురించి ధ్రువీకరించిన యుకె రక్షణశాఖ దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. దీనిపై ప్రస్తుతం ఇంతకన్నా వ్యాఖ్యానించలేమన్నది.
UK defence ministry secret documents at Bus stop