ఇండియా ప్రయాణికులిక అంబర్‌లిస్టులో
లండన్: భారత్‌పై ఉన్న ప్రయాణ ఆంక్షలను కొంతమేరకు బ్రిటన్ సడలించింది. ఇండియా నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులను ఇప్పుడు అంబర్ లిస్టులోకి మార్చింది. ఇంతవరకూ వీరిని రెడ్ లిస్టులో ఉంచారు. దీనితో ఇప్పటివరకూ పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ పొంది భారత్ నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా పదిరోజుల హోటల్ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. అయితే సడలింపుల క్రమంలో ఈ పదిరోజుల క్వారంటైన్ అవసరం లేదు. ప్రపంచవ్యాప్త కోవిడ్ పరిస్థితులతో వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి బ్రిటన్‌లో ఆంక్షల సంబంధిత ట్రాఫిక్ లైట్ సిస్టమ్ ఖరారు అయింది. దీని మేరకు అంబర్ లిస్టులో చేరిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పది రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది. రవాణా విభాగం ప్రకటించిన సిగ్నలింగ్ మార్పులు ఆదివారం నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పుడు జరిగిన మార్పులతో ఇండియా, ఖతార్, యుఎఇ, బహరైన్‌లు రెడ్ లిస్టు నుంచి అంబర్ లిస్టులోకి చేరాయని బ్రిటన్ రవాణా విభాగం సెక్రెటరీ ట్వీటు వెలువరించారు. ఆయా దేశాలలో వ్యాక్సినేషన్ల స్థాయిని బట్టి వాటిని బ్రిటన్ ప్రయాణ ఆంక్షల జాబితాలోకి చేర్చడం జరుగుతోంది. ఇప్పటి మార్పుతో ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయిన విషయాన్ని బ్రిటన్ గుర్తించిన అంశం స్పష్టం అయింది.
UK eases travel restrictions from India