లండన్ : వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను రప్పించేందుకు కొన్నేళ్లుగా అమెరికా చేస్తున్న కృషి ఫలించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను అమెరికాకు అప్పగించడానికి బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. అయితే తుది ప్రయత్నంగా దీనిపై అప్పీలు చేసేందుకు అసాంజేకు 14 రోజుల గడువు మంజూరు చేసింది. మెజిస్ట్రేట్, హైకోర్టుల పరిశీలన తరువాత జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించడానికి నిర్ణయించాం. దీనిపై అప్పీలుకు 14 రోజుల గడువు ఇస్తున్నామని యూకె హోంశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. పదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికిలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.
అసాంజేపై గూఢచర్యానికి సంబంధించిన 17 అభియోగాలు ఉన్నాయని వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది. వాటిలో ఆయనకు గరిష్ఠంగా 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసాంజేను తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆమేరకు చేసుకున్న అప్పీల్ తిరస్కరణకు గురైంది. అత్యంత గరిష్ఠ భద్రత కలిగిన అమెరికా జైల్లో ఉంచడం వల్ల ఆత్మహత్యకు పాల్పడే ముప్పు ఉందని వాదించి, కోర్టు నుంచి అసాంజే ఉపశమనం పొందారు. కానీ అమెరికా తన ప్రయత్నాలు మానలేదు.