Friday, October 18, 2024

తల్లిని కాబోనని, తల్లులకు గర్భశోకం మిగిల్చిన నర్సు..

- Advertisement -
- Advertisement -

లండన్ : తనకు పిల్లలు పుట్టరని గోడ్రాలుగా మిగిలిపోతాననే తపన ఆ నర్సులో కసి పెంచింది. కిరాతకానికి పురికొల్పింది. వైద్య వృత్తిలో అత్యంత విలువైన సేవలకు ప్రతీక అయిన నర్సుగా ఉన్న33 ఏండ్ల లూసీ లెట్బీ ఏడుగురు పసికందుల ప్రాణాలు తీసింది. చేస్తున్న వైద్య వృత్తికి కళంకం తీసుకువచ్చింది. మానవత్వాన్ని మంటగలిపింది. ఈ నర్సు ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసిన ఉదంతాన్ని భారతీయ సంతతికి చెంది, బ్రిటన్‌లో జన్మించిన డాక్టర్ రవి జయరాం వెలుగులోకి తీసుకువచ్చారు. నార్తర్న్ ఇంగ్లాండ్‌లోని చెస్టెర్ ఆసుపత్రిలో ఈ డాక్టర్ పిల్లల స్పెషలిస్టుగా ఉన్నారు. పసికందుల విభాగంలో నర్సుగా ఉన్న లూసీ ఏడుగురు శిశువులను హత్య చేసిందని శుక్రవారం దోష నిరూపణ జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఏడాదిగా నయవంచనకు పాల్పడుతూ ఈ నర్సు ఏడుగురు పసికందులను చంపివేయడమే కాకుండా మరో ఆరుగురు శిశువులను చంపివేసేందుకు సమయం కోసం ఎదురుచూసిందని వెల్లడైంది.

అన్నెం పున్నెం తెలియని శిశువులు, వారికోసం తల్లడిల్లే తల్లిదండ్రులను వారి గర్భశోకాన వారిని వదిలిపెట్టి రాక్షసంగా వ్యవహరించింది. ఆమె చంపేసిన వారిలో ఒక్కరోజు కూడా నిండని శిశువు కూడా ఉంది. ఆమె కేసుపై దాదాపు పది నెలల పాటు మాంచెస్టర్ కోర్టులో విచారణ సాగింది. ఇక్కడి ప్రసూతి ఆసుపత్రిలో నర్సుగా చేరిన లూసీ వికృత రీతిలో వ్యవహరించేది. అయితే ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చూసుకునేది. 2016 సంవత్సరం ముందు నుంచి ఆమె రాక్షసకాండను సాగించింది. ఆమె విధులలో ఉన్నప్పుడు అక్కడ పనిచేసే ఓ డాక్టరుపై ప్రేమ పెంచుకుంది. ఇద్దరి మధ్య వివాహేతర బంధం కూడా ఏర్పడింది. తరచూ ఆయన దృష్టిలో పడేందుకు తాను నర్సుగా పనిచేసే చోటుకు ఈ డాక్టరును రప్పించుకునేందుకు కూడా తన సంరక్షణలో ఉండే పిల్లలను అందుబాటులో ఉండే ప్రక్రియలతో చంపేసేది. పరిస్థితి విషమించడానికి ముందు అక్కడున్న వారితో ఇక పిల్లలు బతకడం కష్టమని చెప్పేది. ఓ సారి ఓ డాక్టరుతో ఈ ఆసుపత్రిలో ప్రసవించే పిల్లలు బతికి నిలుస్తారా? అని చెప్పిందట.

ఆమె నివాసంలో నుంచి కొన్ని కాగితాలను స్వాధీనపర్చుకున్నారు. ఇందులో ఆమె తాను పిల్లలను చంపినట్లు రాసుకుందని వెల్లడైంది. తాను మంచిదాన్ని కానని, పసికందులను జాగ్రత్తగా చూసుకునేంత మంచితనం లేదని, చెడ్డదాన్ని కాబట్టే వారిని ఉద్ధేశపూరితంగానే చంపివేశానని ఇందులో తెలియచేసుకుందని విచారణలో వెల్లడైంది. తనకు పెళ్లికాదు, పిల్లలు పుట్టరు, ఇక ఎవరికో పుట్టిన పిల్లలను రక్షించేందుకు తానేందుకు పాటుపడాలని ప్రశ్నించుకుంది. పైగా ఆమెపై అభియోగాలు వెలువడగానే విధుల్లో నుంచి తీసివేసిన తరువాత కూడా ఆమె వైవాహికేతర బంధంతో ఉన్న డాక్టరుతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. నేరాభియోగాలు రుజువైన లూసీపై శిక్షకాలాన్ని తీర్పును సోమవారం వెలువరించనున్నారు.

పిల్లల నెత్తుటిలో గాలి..ఇంజెక్షన్లలో విషం
పలురకాలుగా చంపేసింది
తన ఆలనాపాలనకు వచ్చే పిల్లలను చంపేందుకు నర్సు పలు మార్గాలను ఎంచుకుంది. వారి రక్తంలోకి గాలిని పంపించేది. దీనితో వారు ఉక్కిరిబిక్కిరి అయ్యి ప్రాణాలు వదిలేవారు. ట్యూబ్‌లోకి ఘనాహారాన్ని పంపించడం, లేదా వారికి మోతాదుకు మించి పాలు అందేలా చేయడం, అన్నింటికి మించి వారికి ఇన్సూలిన్‌లో విషం కలిపి ఇవ్వడం, ఈ పనుల గురించి కోడ్‌లో తన సన్నిహితులకు మెస్సెజ్‌లు పెట్టడం చేసేది. తొలిసారిగా ఆమె 2015 జూన్ 15న ఓ బిడ్డను చంపేసి , తన వార్డులో ఓ బేబీ చనిపోయిందని సమాచారం పంపింది. తరువాత ఎక్కువగా శిశువుల వార్డులో విధులు నిర్వర్తించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తూ వచ్చింది.

2015లో శిశువుల ఉదంతాన్ని గుర్తించిన డాక్టర్ రవి
భారతీయ సంతతికి చెందిన డాక్టరు రవి చెస్టెర్ ఆసుపత్రిలో పనిచేసే దశలో 2015లో సంభవించిన మూడు శిశు మరణాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత అక్కడనే వరుసగా పలువురు పిల్లలు రోజులు తిరగకముందే చనిపోతూ వచ్చారు. దీనితో ఆసుపత్రి వైద్యులు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యి, పోలీసులకు తెలిపారు. దీనితో పిల్లల మరణాలపై దర్యాప్తు జరిగింది. ఈ క్రమంలోనే లూసీ విషయం వెలుగులోకి వచ్చింది. ముందుగానే పోలీసులకు తెలిసి ఉంటే పలువురు చిన్నారులు బతికి ఉండేవారని , ఇప్పటికీ స్కూళ్లకు వెళ్లే వారని ఈ డాక్టరు తెలిపారు. డాక్టర్ రవిజయరాం పది సంవత్సరాల పాటు బ్రిటన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్‌లో కూడా పనిచేశారు. పిల్లల్లో అస్థమా, ఉపిరితిత్తుల సమస్యలు, వింత ప్రవర్తనల వంటి కీలక విషయాలలో కూడా నిపుణులు. వైద్య విద్య, తీవ్రంగా జబ్బుపడ్డ పిల్లల చికిత్సలో ఆరితేరిన వైద్యులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News