Monday, December 23, 2024

బిబిసికి బ్రిటన్ దన్ను..

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ ప్రభుత్వ పగ సాధింపుకి గురైన బిబిసి (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) కి ఆలస్యంగానైనా తమ పార్లమెంటు ముఖంగా మద్దతు తెలపడం ద్వారా బ్రిటిష్ పాలకులు తమ పరువును కాపాడుకున్నారు. 2002 అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పాత్రను తప్పు పడుతూ ‘ఇండియా: ది మోడీ కొశ్చన్’ పేరిట బిబిసి ఇటీవల విడుదల చేసిన రెండు భాగాల డాక్యుమెంటరీ అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని వెనువెంటనే యూ ట్యూబ్, ట్విటర్ల నుంచి తొలగింపజేసింది. దీనిని సంపాదించి బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించబోయిన వారిని పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది.

అంతటితో ఆగకుండా బిబిసి ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సుదీర్ఘమైన దాడులు జరిపింది. వాటికి సర్వే దాడులని ముద్దు పేరు పెట్టారు. బిబిపి పన్ను లెక్కల్లో లోటుపాట్లు, అవకతవకలు బయటపడినట్టు రాబడి పన్ను శాఖ అధికారులు ప్రకటించారు. మోడీపై డాక్యుమెంటరీని బిబిసి విడుదల చేసిన తర్వాతనే ఈ దాడులు జరపడం కక్ష సాధింపు చర్యేనని మీడియాపై సాగిన అణచివేతేనని ప్రపంచమంతా బిగ్గరగా ఖండించింది. భారత దేశంలోని ప్రజాస్వామిక ప్రియులందరూ దీనిని తీవ్ర అభ్యంతరకరమైన సెన్సార్ షిప్‌గా పరిగణించారు. మీడియా స్వేచ్ఛ తిరుగులేనిదని, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అని ఈ సందర్భంగా ప్రకటించడం ద్వారా అమెరికా కూడా బిబిసికి దన్నుగా నిలిచింది. విచిత్రంగా ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం గాని, ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ గాని ఇటీవలి వరకు మౌనాన్నే పాటించాయి. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. బ్రిటన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ మౌనానికి స్వస్తి చెప్పింది.

మొన్న మంగళవారం నాడు బ్రిటన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి ఒకరు ‘ఇండియాలో బిబిసి కార్యాలయాలపై దాడి’ అనే పేరిట అక్కడి పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. ‘మేము బిబిసికి అండగా వుంటాం, దానికి నిధులు సమకూరుస్తాం’ అని అందులో పేర్కొన్నారు. అలాగే ‘బిబిసి సంపాదక స్వేచ్ఛను గట్టిగా సమర్థిస్తున్నాం’ అని కూడా ప్రకటించారు. బిబిసి కార్యాలయాలపై జరిగిన దాడుల విషయంలో భారత ప్రభుత్వంతో విస్తృతమైన చర్చలు జరుపుతున్నామని అని కూడా పార్లమెంటుకు తెలియజేశారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో దేశాల మధ్య సంబంధాలు తాత్కాలికంగానైనా తెగిపోయే అవకాశాలుంటాయి. కాని వాణిజ్య ప్రయోజనాలకు విశేష ప్రాధాన్యమిస్తున్న ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత దేశం వంటి సువిశాలమైన మార్కెట్‌ను వదులుకోడానికి ఏ దేశమూ తొందరపడదు. అలాగే చైనాతో తమకు గల శత్రుత్వం నేపథ్యంలో ఇండియాను బుజ్జగించి తమ ప్రయోజనాలకు వాడుకోడానికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి.

ఈ ధైర్యంతోనే ప్రధాని మోడీ ప్రభుత్వం బిబిసిని తొక్కిపెట్టడానికి బాహాటంగా దాడులు జరిపించింది. తద్వారా మోడీ అత్యంత శక్తిమంతుడని ఆయన అనుయాయులకు చాటిచెప్పాలని సంకల్పించారు. ఇదంతా మోడీత్వానికి గల మొరటు కోణం కాగా, బిబిసిపై దాడులు ప్రపంచం దృష్టిలో భారత దేశం పరువు, ప్రతిష్ఠలను తీవ్రంగా దెబ్బ తీసిన సంగతిని ఎవరూ కాదనలేరు. ఒక ప్రజాస్వామిక దేశంగా చేయకూడని అపరాధానికి ఇండియా పాల్పడిందనే సందేశం ప్రపంచం నలుమూలలకీ అందింది. ఇందుకు భారతీయులుగా మనందరం కలత చెందవలసిందే. బిబిసిపై దాడులను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. 2021 జూన్‌లో దైనిక్ భాస్కర్, భారత్ సమాచార్‌లపై కూడా ఇదే మాదిరి దాడులు జరిగాయని పేర్కొన్నది.

కొవిడ్ 19 మరణాల తీవ్రతను తెలియజేస్తూ గంగా నదిలో తేలియాడిన శవాల దృశ్యాలను ప్రచురించినందుకు దైనిక్ భాస్కర్‌పై ఈ దాడులు జరిగాయి. అదే ఏడాది సెప్టెంబర్‌లో న్యూస్ క్లిక్, న్యూస్‌లాండ్రీ కార్యాలయాలపైన కూడా ఈ దాడులు చోటు చేసుకొన్నాయి. ఒక స్వతంత్ర మీడియా సంస్థగా బిబిసికి అంతర్జాతీయంగా వున్న పేరు ప్రతిష్ఠలు అసాధారణమైనవి. మోడీ ప్రభుత్వానికున్న విశ్వసనీయత కంటే అంతర్జాతీయంగా బిబిసికున్న విశ్వసనీయతే ఘనమైనదని మన దేశంలోని ప్రముఖ పాత్రికేయులే అభిప్రాయ పడిన వాస్తవాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవలసి వుంది. దేశాల సరిహద్దులను పక్కన పెడితే ప్రపంచ మానవాళి సవ్యమైన మనుగడకు మీడియా స్వేచ్ఛ ప్రాణం వంటిది. దాని కంఠం మీద బూటు కాలు పెట్టి అణచివేయదలచిన శక్తి దేశీయమైనదైనా, విదేశీదైనా దానిని తీవ్రంగా ఖండించవలసిందే. అంతిమంగా ప్రజాస్వామ్య విలువలు మీడియా స్వేచ్ఛ అండతో సజీవంగా కొనసాగవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News