Thursday, January 23, 2025

రేపు బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నిక రిజల్ట్..

- Advertisement -
- Advertisement -

UK PM Election Result 2022 Tomorrow

ముగిసిన ఓటింగ్ ప్రక్రియ
రేపు బ్రిటన్ కొత్త ప్రధాని ఎన్నిక ఫలితం
ట్రస్, సునాక్ మధ్య ముగిసిన పోటాపోటీ
క్వీన్ ఎలిజబెత్‌కు విజేత గౌరవ వందనం
తరువాతనే అధికారిక ప్రక్రియ ఆరంభం
లండన్: బోరిస్ జాన్సన్ అర్థాంతర పదవీ నిష్క్రమణ తరువాత బ్రిటన్ ప్రధాని పదవి భర్తీ ప్రక్రియ మరో 24 గంటలలో ముగియనుంది. భారతీయ సంతతి మూలాలున్న రిషిసునాక్, లిజ్ ట్రస్ మధ్య పోటీ ఉత్కంఠలు, పలు మలుపులతో ఫార్మూలా ఒన్ రేస్‌గా మారింది. రిషి సునాక్, ట్రస్‌లలో ఎవరు బ్రిటన్ ప్రధాని అవుతారనే అంశం సోమవారం సాయంత్రం వెల్లడవుతుంది. క్వీన్ ఎలిజబెత్ విజేతను లాంఛన ప్రాయంగా ప్రకటించనున్నారు. సాధారణంగా ఈ ప్రధాని పదవి ప్రకటనను లండన్‌లోని క్వీన్ అధికారిక రాజభవనం నుంచి వెలువరించాలి. అయితే ఇప్పుడు క్వీన్ స్కాట్లాండ్‌లో ఉండటంతో అక్కడి నుంచే విజేతను ప్రకటిస్తారు. బ్రిటన్‌కు కాబోయే ప్రధాని రాణిని మర్యాదపూర్వకంగా కలిసి, ఆమె ఆశీస్సులు తీసుకునే క్రమంలో సాంప్రదాయకంగా ఆమె హస్తాన్ని ముద్దాడే ప్రక్రియ ఉంటుంది. అధికార కన్సర్వేటివ్ పార్టీకి అధినేతను ఎంపిక చేసుకునే క్రమంలో పలు రౌండ్ల పోటీ తరువాత ఇప్పుడు బరిలో ఇద్దరు మిగిలారు. తుది రౌండ్‌లో టోరీ ఎంపిలు ట్రస్, సునాక్‌లలో ఒకరిని నేతగా ఎంచుకుంటారు. ఈ విధంగా నేతగా నిలిచే వ్యక్తి బ్రిటన్‌కు తరువాతి ప్రధాని అవుతారు. కన్సర్వేటివ్ పార్టీ అధినేత ఎన్నిక అంతా కూడా అంతర్గత ప్రక్రియగానే సాగుతుంది. నేత ఎంపిక తరువాత ప్రధానిగా నియమితులు కావడం అధికారిక వ్యవస్థలో భాగం అవుతుంది. పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ప్రచార ఘట్టాలకు ఇరువురు నేతలు తెరలు వేశారు. తుది ప్రక్రియలో భాగంగా సీల్ వేసి ఉన్న దాదాపు 1.6 లక్షల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనితో విజేత పేరు ఖరారు అవుతుంది. ప్రచారం, నేత ఎన్నిక తుది ఘట్టం ముగింపు దశలో సునాక్, ట్రస్ కలిసి నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక నేత నిర్ణేత ఘట్టం కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు. కొత్త నేత ఎంపిక తరువాత పేరును తొలుత మాజీ ప్రధాని జాన్సన్ 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అధికారికంగా ప్రకటిస్తారు. తరువాత ఆయన స్కాట్లాండ్‌కు వెళ్లి, క్వీన్‌కు విషయం తెలియచేస్తారు. తమ రాజీనామాను ప్రకటిస్తారు.
స్కాట్లాండ్ రాజభవనంలో అధికార స్వీకరణ 
వైదొలిగిన ప్రధాని నుంచి కొత్త ప్రధానికి బాధ్యతల అప్పగింత ఘట్టం ఇంతకు ముందటికి భిన్నంగా ఈసారి స్కాట్లాండ్‌లోని బల్‌మోరల్ క్యాజిల్‌లో జరుగుతుంది. లాంఛనం ప్రకారం ఈ కార్యక్రమం లండన్‌లోని బకింగ్‌హాం ప్యాలెస్‌లో జరగాలి. కానీ సమ్మర్ సెలవుల విడిదికి ఈసారి క్వీన్ స్కాట్లాండ్ ను ఎంచుకోవడంతో విజేతలు అక్కడికి వెళ్లుతారు. కొత్త ప్రధాని నియామక ప్రకటన తరువాత కొత్త ప్రధాని లండన్‌కు తిరిగి వెళ్లుతారు. అక్కడ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో సోమవారం మధ్యాహ్నం ప్రసంగిస్తారు. మంత్రుల బృందాన్ని ప్రకటిస్తారు. కొత్త మంత్రి మండలి మరుసటి రోజు బుధవారం భేటీ అవుతుంది. ఇదేరోజు పార్లమెంట్ సమావేశం జరుగుతుంది. క్వశ్చన్ అవర్‌లో భాగంగా కొత్త ప్రధాని దేశంలోని ప్రతిపక్షం అయిన లేబర్ పార్టీ నేత కియిర్ స్టార్మెర్ నుంచి తొలి ప్రశ్నను ఎదుర్కొంటారు.
లిజ్ ట్రస్‌కే విజయం?
శుక్రవారం ఓటింగ్ ప్రక్రియ ముగిసిన దశలో దేశ తదుపరి ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దేశ విదేశాంగ మంత్రిగా ఉన్న ట్రస్ చివరి రౌండ్లలో రిషి సునాక్‌కు గట్టిపోటిని ఇచ్చి తుదిదశలో ఆయను వెనకకు నెట్టివేసినట్లు, ఎంపిలు అత్యధికంగానే ఆమెకు ఓటేసినట్లు వెల్లడైంది. నెలరోజులకు పైగా తీవ్రస్థాయి ప్రచారం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ అంశాలే ప్రధాన పోటీదార్ల మధ్య కీలకంగా నిలిచాయి. యుగవ్ జరిపిన పోల్ ప్రకారం చూస్తే లిజ్ తమ ఏకైక ప్రత్యర్థి సునాక్‌తో పోలిస్తే మొత్తం మీద 66 శాతం మించి ఆధిక్యతను చాటుకునే వీలుందని వెల్లడైంది. ఓ దశలో రిషి సునాక్‌కు ఉన్న 41 శాతం పాపులారిటీ క్రమేపీ పడిపోతూ చివరికి ఇది 21 శాతానికి దిగజారింది. విజేత ప్రకటన దశలో ట్రస్ ఆధిక్యత నిరూపితం కానుంది.

UK PM Election Result 2022 Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News