- Advertisement -
కీవ్ : రష్యా ఆక్రమిత క్రిమియా లోని ఫియోడోసియా నౌకాశ్రయంలో రష్యా కు చెందిన భారీ సైనిక రవాణా నౌకపై ఉక్రెయిన్ యుద్ధవిమానాలు దాడి చేశాయి. ఈ దాడిలో రష్యా నౌక ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ ప్రకటించారు. ఈ దాడిని రష్యా రక్షణ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. అయితే నౌక కేవలం దెబ్బతిన్నట్టు తెలియజేసింది. రష్యా ల్యాండింగ్ నౌక ‘నోవోచెర్‌కాస్క్’ ఈ దాడిలో దెబ్బతిందని పేర్కొంది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారని క్రిమియా అధినేత సెర్గీ అక్సియోనోవ్ వెల్లడించారు. ఈ దాడి సమయంలో రెండు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను తమ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థ ధ్వంసం చేసిందని రష్యా తెలిపింది. రష్యా నౌకపై దాడుల వల్ల నల్లసముద్రంలో నౌకారవాణా తిరిగి సాగడానికి వీలవుతుందని, మిలియన్ టన్నుల ధాన్యాలు రవాణా అవుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
- Advertisement -