ఉక్రెయిన్ ఆక్రమిత దొనేత్సక్ ప్రాంతంపై జరిపిన క్షిపణి దాడిలో దాదాపు 400 మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.
దొనేత్సక్: రష్యా దళాలు ఉన్న మికివ్కా నగరంను లక్షం చేసుకుని ఉక్రెయిన్ క్షిపణి దాడి జరిపింది. అయితే ఈ దాడిలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా సరిగా తెలియదు. కానీ పెద్ద ఎత్తునే ప్రాణ నష్టం జరిగిందని రష్యా అనుకూల అధికారులు తెలిపారు. కానీ గణాంకాలను వారు ధృవీకరించలేదు. కీవ్‌లో ఆదివారం రాత్రి వైమానిక దాడులు జరిగాయి. రష్యా తాజాగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. దొనేత్సక్‌లోని ఆక్రమిత భాగాలలో రష్యా మద్దతు ఉన్న సీనియర్ అధికారి డానిల్ బెజ్సోనోవ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజున అర్ధరాత్రి రెండు నిమిషాల తర్వాత క్షిపణి మికివ్కా నగరంను తాకిందన్నారు. ‘అమెరికన్ ఎంఎల్‌ఆర్‌ఎస్ హిమార్స్ నుంచి వృత్తి విద్యా పాఠశాలకు భారీ దెబ్బ తగిలింది’ అని ఆయన తెలిపారు. ‘చాలా మంది చనిపోయినవారు, గాయపడినవారున్నారు…కానీ ఖచ్చితమైన సంఖ్య మాత్రం తెలియదు’ అని బెజ్సోనోవ్ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’లో పోస్ట్ పెట్టారు.
రష్యన్ ప్రెజెంటర్ వ్లాదిమిర్ సోలోవియోవ్ టెలిగ్రామ్‌లో ‘ప్రాణ నష్టం గణనీయంగా ఉంది…దాదాపు 400 వరకు చనిపోయి ఉండొచ్చు’ అని రాశారు. కాగా ఉక్రెయిన్ మిలిటరీ ప్రకారం 400 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారు.