కీవ్: కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు రావడం లేదు. అయితే తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మద్దతు లేకుండా తాము బతకడం కష్టమే అంటూ ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌ల మధ్య ఫోన్ సంభాషణ జరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధన్ని ముగించాలని పుతిన్ భావించడం లేదని అన్నారు. విరామ సమయంలోనూ ఆయన యుద్ధానికి మరింత సంసిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. అందుకే అమెరికా తమకు మద్దతు ఇవ్వకపోతే.. తాము జీవించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అంతేకాక.. రష్యా కారణంగా యూరోపియన్ దేశాలకు కూడా ముప్పు ఉందని.. త్వరలో రష్యా యూరోప్‌పై దాడి చేసే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి యూరప్ దేశాలు ఇప్పటికైనా మేల్కోని తమ సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.