హిరోషిమా ః భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షులు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం కొద్ది సేపు సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌లో ఇప్పుడు మానవీయ సమస్య నెలకొందని, సంక్షోభ నివారణకు, పరిష్కారానికి భారతదేశం తన వంతుగా సాధ్యమైంతగా పాటుపడుతుందని ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. జపాన్‌లోని హిరోషియాలో జరుగుతోన్న జి 7 సమ్మిట్ నేపథ్యంలో ఇరువురి మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడుల తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. సంక్షోభ దశలో ఇరువురు నేతలు ఓ సారి వర్చువల్‌గా మాట్లాడుకున్నారు. ఇప్పుడు జెలెన్‌స్కీని నేరుగా కలిసిన దశలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం మొత్తం ప్రపంచానికి కలవరం కల్గించే విషయం.
పలు విధాలుగా ప్రపంచంపై ప్రభావం చూపుతోందని మోడీ తెలిపారు. ఇది కేవలం రాజకీయ లేదా ఆర్థిక విషయాల సంబంధితం కాదని తన అభిప్రాయంలో ఇది మానవతకు, మానవీయ విలువలకు సంబంధించిన అంశం అని మోడీ పేర్కొన్నట్లు వీరి భేటీ తరువాత వెలువడ్డ వీడియో క్లిప్ ద్వారా వెల్లడైంది. గత ఏడాది ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు , యువత తిరిగి ఇండియాకు వచ్చిన దశలో అక్కడి పరిస్థితి గురించి వారిద్వారా తెలుసుకున్నానని, ఉక్రెయిన్ పౌరుల ఆవేదనను తాను గుర్తించానని తెలిపిన ప్రధాని తనకంటే మీకే ఎక్కువగా అంతర్గత సమస్యల గురించి తెలుసునని జెలెన్‌స్కీకి చెప్పారు. భారతదేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నప్పుడు జెలెన్‌స్కీని మోడీ కలిసినప్పటి ఫోటోలను ప్రధాని కార్యాలయం అధికారికంగా వెలువరించింది.
రష్యాకు వ్యతిరేకంగా పోరులో భారతదేశం సహకారం కావాలని జెలెన్‌స్కీ ప్రధాని మోడీని కోరినట్లు వెల్లడైంది. ఉక్రెయిన్ ప్రధమ ఉప విదేశాంగ మంత్రి ఎమినె జాపరోవాల నెలరోజుల క్రితమే భారతదేశంలో పర్యటించి వెళ్లారు. ప్రధాని మోడీకి జెలెన్‌స్కీ రాసిన లేఖను ఈ సందర్భంగా ఆమె భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి అందించి వెళ్లారు. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో ఇతర దేశాలకు భిన్నంగా భారతదేశం రష్యా పట్ల తటస్థ వైఖరి ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి.