Wednesday, January 22, 2025

ఉక్రెయిన్ భీకర క్షిపణి దాడులు.. 400మంది రష్యా సైనికులు మృతి?

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ భీకర క్షిపణి దాడులు
400 మంది రష్యా సైనికులు మృతి?
డోనెస్క్ ప్రాంతంలో గురి చూసి దాడి
మృతుల సంఖ్య 63గా మాస్కో వెల్లడి
భీకర మలుపు తిరిగిన ఘర్షణ

కీవ్: 2023 ఆరంభం దశలోనే రష్యా ఉక్రెయిన్ ఘర్షణ మరింత కీలక మలుపు తిరిగింది. తాము మిస్సైల్స్‌తో జరిపిన దాడులలో దాదాపు 400 మంది వరకూ రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ సోమవారం అధికారికంగా తెలిపింది. ఆక్రమిత డొనెస్క్ ప్రాంతంలో రష్యను బలగాలను లక్షంగా ఎంచుకుని తాము దాడులను ఉధృతం చేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ వాదనను రష్యా అధికారులు స్థానికంగానూ, మాస్కోలోనూ ఖండించారు. ఉక్రెయిన్ బలగాలు దాడికి దిగిన మాట వాస్తవమే అని, అయితే ఈ దశలో తమ బలగాలకు చెందిన 63 మంది మృతిచెందారని తెలిపారు.

అయితే ఈ దాడులలో తాము వందలాది మంది రష్యన్ సైనికులను తుదముట్టించినట్లు తాము మకివ్‌కా నగరంలో రష్యా బలగాలు బస చేసిన నివాసాన్ని ఎంచుకుని దాడులకు దిగామని ఇక్కడ వందలాది మంది రష్యా సైనికులు చనిపోయినట్లు నిర్థారణ అయిందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని భవనం పూర్తిగా నేలమట్టం అయింది.

మరో వైపు ఆదివారం కీవ్ ఇతర ప్రాంతాలలో వైమానిక దాడులు మరింత ఉధృతం అయినట్లు భీకరస్థాయిలో సైరన్ల మోతలు విన్పించినట్లు బిబిసి ఇతర వార్తా సంస్థలు తెలిపాయి. రష్యా నుంచి ఉక్రెయిన్ వైపు దాడుల ఉధృతి దశలోనే ఇతర ప్రాంతాలలోని రష్యా సేనలను ఎంచుకుని ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగిందని వెల్లడైంది. తాము హిమార్స్ మిస్సైల్స్‌తో దాడికి దిగినట్లు , ఇతర వివరాలను వ్యూహాత్మక రహస్యాల కోణంలో వెల్లడించదల్చుకోలేదని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి.

అయితే రష్యా బలగాలు తాము బస చేసి ఉన్న స్థావరాలలో నిర్లక్షంగా ఉండటం, తాము ఉనికిని తెలియచేసుకునేలా అక్కడ పొగలు పెట్టుకోవడం, నిప్పులు రాజేసుకుని ఉండటం సంచరించడం వంటి వాటితో వీరిని పసికట్టి వెంటనే దాడులకు దిగామని ఉక్రెయిన్ తెలిపింది. తమ స్థావరంపై కనీసం పాతిక రాకెట్ల దాడులు జరిగినట్లు రష్యా నియుక్త అధికార యంత్రాంగం ఉక్రెయిన్‌లో తెలిపింది. రష్యా బలగాలకు తీవ్రనష్టం వాటిల్లడంతో ఇప్పుడు తమపై తిరిగి ప్రతిదాడులు జరుగుతాయని, ఇందుకు సన్నద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News