Monday, January 20, 2025

రెండు నెలల తర్వాత.. ఆ భవనం కింద 44 మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

Ukraine official says 44 dead from building collapse

రష్యా బాంబుదాడిలో ఖర్కివ్‌లో కూలిన అయిదంతస్తుల భవనం
ఉక్రెయిన్‌లో మరో భయానక యుద్ధ నేరం
ఒడెసాపై ఆగని క్షిపణి దాడులు

కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులకు దిగిన రష్యా ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తొలుత సైనిక స్థావరాలే లక్షంగా దాడులు సాగించిన రష్యా ఆ తర్వాత నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. దీంతో అనేక భవనాలు నేలమట్టమవుతున్నాయి.వాటికింద ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన ఖర్కివ్‌లో రెండు నెలల క్రితం రష్యా ఓ అయిదంతస్థుల భవనంపై బాంబులు జారవిడిచింది. తాజాగా ఆ భవనం శిథిలాల కింద 44 మృత దేహాలు బయటపడ్డాయి. ఖర్కివ్‌లోని ఇజియం ప్రాంతంలో ఓ అయిదంతస్థుల భవనం రష్యా దాడుల్లో నేలమట్టమయింది.ఆ సమయంలో భవనంలో పెద్ద సంఖ్యలో పౌరులున్నారు. మార్చి మొదటి వారంలో ఈ ఘటన జరగ్గా అప్పటినుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ భవన శిథిలా కింద 44 మృతదేహాలను అధికారులు గుర్తించినట్లు ఖర్కివ్ రీజినల్ అడ్మినిస్రేషన్ హెడ్ ఒలే సినేహుబోవ్ ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. ఉక్రెయిన్ పౌరులపై రష్యా సేనలు పాల్పడిన మరో భయానక యుద్ధనేరంగా దీన్ని ఆయన పేర్కొన్నారు. గత 11 వారాలుగా రష్యా ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని నగరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.

ముఖ్యంగా ఖర్కీవ్, మరియుపోల్, కీవ్ పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల లుహాన్స్ ప్రాంతంలో ఓ పాఠశాల షెల్టర్‌పై బాంబుదాడి చేయగా, 60 మంది దాకా మరణించినట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు మరియుపోల్‌లోని ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది.ఆ సమయంలో థియేటర్‌లో వెయ్యి మంది దాకా తలదాచుకుని ఉన్నారు. ఇందులో కనీసం 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇటీవల పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కీవ్ శివార్లలోని బుచాలో సైతం పెద్ద సంఖ్యలో పౌరులను హతమార్చినట్లు వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లోని కీలక రేవు పట్టణం ఒడెసాపై రష్యా క్షిపణి దాడులు ఉధృతమయినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. తాజా దాడుల్లో ఒకరు మృతి చెందగా అయిదుగురు గాయపడినట్లు తెలుస్తోంది. ఓ షాపింగ్ సెంటర్‌తో పాటుగా ఆయుధ డిపోపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరో వైపు మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్‌ప్లాంట్‌లో ఇంకా వందమంది దాకా చిక్కుకుని ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. ఆ ప్లాంట్‌పై పట్టు కోసం గత కొన్ని రోజులుగా రష్యా భీకర పోరు సాగిస్తున్న విషయం తెలిసింది. ప్లాంట్‌లో వందలాది మంది ఉక్రెయిన్ సైనికులతో పాటుగా దాదాపు 2 వేల మంది తలదాచుకుని ఉన్నారు. గత కొద్ది రోజులుగా వీరిలోదాదాపుగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ స్టీల్‌ప్లాంట్‌పై పూర్తి పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో ఇంకా అక్కడ వంద మంది ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News