స్విస్‌లో ఉక్రెయిన్ శాంతి సదస్సు
ఈ నెల 15, 16 తేదీలలో
ప్రధాని మోడీ కూడా హాజరు?
అంతకు ముందు ఇటలీలో జి 7భేటీ
న్యూఢిల్లీ : స్విట్టర్లాండ్‌లో ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు జరిగే ఉన్నత స్థాయి సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్న దశలో తలెత్తిన సంక్షోభ నివారణకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ భేటీకి రష్యా, చైనాలు వెళ్లకపోవచ్చు. ఇక్కడి శాంతిసదస్సుకు ముందు ఇటలీలో జి 7 సమ్మిట్ జరుగుతుంది. దీనికి భారతదేశంతో పాటు ప్రధాన గ్లోబల్ సౌత్ దేశాలకు ఆహ్వానాలు అందాయి.
స్విట్జర్లాండ్ శాంతి సదస్సు ఈ నెల 15, 16 తేదీలలో ఖరారు అయింది. అంతకు ముందు రోజు ఇటలీలో జరిగే జి 7 సమ్మిట్‌కు వచ్చే నేతలు ఈ సదస్సుకు తరలివచ్చే వీలుంది. ఈ సదస్సు ఏర్పాటు ప్రాతినిధ్యం గురించి ఇప్పటికే స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్, బ్రెజిల్, చైనా, ఇథియోపియా, బ్రెజిల్, చైనా, అరేబియా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు , ఆయాదేశాల రాయబార్లతో చర్చించింది. శాంతిస్థాపన దిశలో జరిగే ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరింది. ఇప్పటికైతే సదస్సుకు హాజరీ విషయంలో చైనా, రష్యాల నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. ఇప్పటికే రష్యా ఈ సదస్సు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించింది.
పశ్చిమదేశాలు తమ ఉక్రెయిన్ అనుకూల వైఖరిని చాటుకునేందుకు ఇది మరో వేదిక అవుతుందని అభిప్రాయపడింది. కీవ్ పట్ల ప్రపంచ స్థాయిలో సానుకూలతను కూడగట్టేందుకు జరిగే ప్రయత్నం అని వ్యాఖ్యానించింది. ఈ పరిణామంతో ఈ కీలక సదస్సు రష్యా నుంచి ఎటువంటి ప్రాతినిధ్యంలేకుండానే సాగుతుందని వెల్లడైంది. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ కూడా సమావేశానికి వస్తారు. చాలాకాలంగా సాగుతూ పరిస్థితిని రగిలేలా చేస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారం దిశలో స్విస్ సదస్సు కీలక పరిణామం అని అంతర్జాతీయ స్థాయిలో బలీయ మద్దతు లభిస్తోంది. సంక్షోభ నివారణకు కనీసం ఈ సదస్సు నుంచి అయినా నిర్థిష్ట ప్రతిపాదనలు వెలువడితే ఆ తరువాత శాంతి ప్రక్రియకు సరైన మార్గం ఏర్పడుతుందని అంతా ఆశిస్తున్నారు.
స్విస్ సదస్సు లుజెర్న్ సిటీ సమీపంలోని అత్యంత విలాసవంతమైన బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వద్ద జరుగుతుంది. ఈ సదస్సుకు స్విస్ అధ్యక్షులు వోలా అమ్‌హెర్డ్ అతిధ్యం ఇస్తున్నారు. శాంతి స్థాపన దిశలో ఇది తొలి అడుగు అని తెలిపారు. ప్రధాని మోడీ కూడా ఈ సదస్సుకు హాజరు అవుతున్న దశలో భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఈ సదస్సు పట్ల ఆశాభావం వ్యక్తం చేసింది. సంక్షోభ నివారణకు ఖచ్చితంగా ఇటువంటి చర్చలు , దౌత్యప్రక్రియ అత్యవసరం అని తాము ఆది నుంచి చెపుతూ వస్తున్నామని మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది.