అమెరికా ఆఫర్‌ను తిరస్కరించిన జెలెన్‌స్కీ
మాకు ఆయుధాలు కావాలి, పారిపోవడానికి సాయం కాదని స్పష్టీకరణ
ఇక్కడే ఉండి రష్యాను ఎదుర్కొంటామని స్పష్టీకరణ
దేశాన్ని వీడేది లేదంటూ వీడియో విడుదల
కీవ్: ఉక్రెయిన్‌లో కల్లోల పరిస్థితులనేపథ్యంలో తనను వేరే దేశానికి సురక్షితంగా తరలిస్తామంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. ‘ఇక్కడ యుద్ధం జరుగుతోంది. మాకు ఆయుధాలు కావాలి. పారిపోవడానికి సాయం కాదు’ అని జెలెన్‌స్కీ గట్టిగా చెప్పినట్లు ఈ సంభాషణను నేరుగా విన్న ఓ అమెరికా ఇంటెలిజన్స్ అధికారి చెప్పారు. తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే ఉండి రష్యాను ఎదుర్కొంటానని ఆయన మరోసారి స్పష్టం చేసినట్లు ఆ అధికారి తెలిపారు. కాగా కీవ్‌ను హస్తగతం చేసుకునే దిశగా రష్యా బలగాలు వేగంగా అడుగులు వేస్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లోను రాజధానిని పోగొట్టుకోబోమని జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. తాను ఉక్రెయిన్ బలగాలను లొంగిపోవాలని ఆదేశిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.ఆన్‌లైన్‌లో చాలా తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోందని తెలిపారు. తాను ఇంకా కీవ్‌లోనే ఉన్నాని, ఆయుధాలను వీడేది లేదని తేల్చి చెప్పారు. తమ దేశాన్ని కాపాడుకుని తీరుతామని పునరుద్ఘాటించారు. కీవ్‌లోని గోరోడెట్‌స్కై హౌస్ పరిసర ప్రాంతాల్లో ఆయన ఈ వీడియోను చిత్రీకరించి పోస్ట్‌చేశారు. కీవ్ సహా ఇతర ప్రధాన నగరాలపై రష్యాదాడికి దిగబోతోందన్న హెచ్చరికల మధ్య ఉక్రెయిన్ వాసుల్లో ధైర్యాన్ని నింపేందుకు జెలెన్‌స్కీ శుక్రవారం రాత్రి కూడా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రాత్రికి మనం ధైర్యంగా తట్టుకోవాలని ఆయన ఆ వీడియోలో ప్రజలకు పిలుపునిచ్చారు.
Ukraine President refuse Joe Biden Offer