Monday, December 23, 2024

పారిపోలేదు.. ఇక్కడనే ఉన్నాను: కీవ్ నుంచి జెలెన్‌స్కీ ప్రకటన

- Advertisement -
- Advertisement -

కీవ్: రష్యా దండయాత్రతో పరిస్థితి దిగజారడంతో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారనే వార్తలు సంచలనానికి దారితీశాయి. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని, తన అధికారిక కార్యాలయంలోనే ఉన్నానని జెలెన్‌స్కీ మంగళవారం అధికారికంగా ప్రకటన వెలువరించారు. తాను ఉంటున్న ప్రాంతపు చిరునామాను తెలియచేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేశారు. రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాలలో రష్యా దళాలు బాంబుల మోతలతో సైనిక విమానాలను ప్రయోగిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇదే దశలో జెలెన్‌స్కీ హత్యకు కుట్ర జరిగిందని తెలియడంతో ఆయనను బంకర్‌లోకి తరలించినట్లు వార్తలు వచ్చాయి. వీటిని ఉక్రెయిన్ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు.

అటువంటిదేమీ లేదన్నారు. కీవ్‌లోని బాంకోవా స్ట్రీట్‌లోనే ఉన్నానని, యుద్ధంలో గెలిచేందుకు చేయాల్సినందంతా చేస్తానని, తలవంచుకుని పారిపొయ్యేది ఏమీ లేదని తెలిపారు. గత 12 రోజులుగా సాగుతోన్న పోరాటం ఇకపైనా కొనసాగుతుంది. కేవలం సైనికులే కాదు ఉక్రెయిన్‌లోని ప్రతి ఒక్కరు పోరు బాటలోనే ఉన్నారని ప్రకటనలో వివరించారు. డాక్టర్లు, జర్నలిస్టులు, దౌత్యవేత్తలు అంతా పోరాటంలోనే ఉన్నారని కితాబు ఇచ్చారు. యుద్ధంలో ఖచ్చితంగా గెలిచి తీరుతామని, ఆయుధ బలం లేకున్నా, సాధనసంపత్తిలో వెనుకబడి ఉన్నా, వెరపు లేదని ప్రకటించారు. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఆక్రమణదారులను చూసి ఇక్కడి ప్రజలు భయపడేది లేదని, ఇప్పుడు సామాన్య పౌరులు కూడా యుద్ధానికి సిద్ధం అంటూ వీధులలోకి వస్తున్నారని, ఆక్రమణదారులతో భయపడి పారిపోయే రకం కాదని తెలిపారు. అంతా కలిసి పోరాడుదాం అని పిలుపు నిచ్చారు.
జెలెన్‌స్కీ హత్యకు భారీ కుట్ర
రష్యా అధికార వర్గాల పూర్తి సహాయ సహకారాలతో వాగ్నర్ గ్రూప్, చెచెన్ స్పెషల్ ఫోర్స్ పలుసార్లు ఆయనను తుదముట్టించేందుకు యత్నించినట్లు ఇటీవలే అంతర్జాతీయ వార్తాసంస్థ తెలిపింది. రష్యాలో సమాంతర సైనిక శక్తిగా, పుతిన్‌కు ప్రైవేటు సైన్యంగా చలామణి అవుతోన్న వాగ్నర్ గ్యాంగ్ సాయుధ దళాలు ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు పలు సార్లు యత్నించి విఫలం అయినట్లు వార్తాసంస్థ తెలిపింది. దాడులు జరిగినట్లు, దీనిని తాము కూడా ధృవీకరించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ కూడా తెలిపింది.

Ukraine President Zelensky says I’m not hiding

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News