కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి నెలాఖరులో ఉక్రెయిన్‌పై దండయాత్రకు సేనల్ని పంపాడు. ఇది ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి కాదని ప్రకటించాడు. కానీ దాడి మాత్రం నూరో రోజుకు చేరుకుంది. యుద్ధంలో తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని వదులుకోడానికి రష్యా ఇష్టపడడం లేదు. ఉక్రెయిన్ లోని హ్రైవ్నియాతో పాటు దక్షిణ ఖెర్సన్ రీజియన్‌లో ఇప్పుడు అధికారిక కరెన్సీ రూబుల్. ఇక్కడి ప్రజలకు, జెపొరిజ్‌జియా రీజియన్ లోని రష్యా నియంత్రణ లోని భాగాలకు రష్యా పాస్‌పోర్టుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఆ రెండు రీజియన్లలో క్రెమ్లిన్ వ్యవస్థాపించిన పాలనాయంత్రాంగాలు ఆయా ప్రాంతాలు రష్యాలో విలీనం కాడానికి తగిన ప్రణాళికలపై చర్చించరు.
తూర్పు ఉక్రెయిన్ డొనబాస్ రీజియన్ లో రష్యా మద్దతు వేర్పాటువాదుల ప్రాంతాల్లో ఎక్కువగా రష్యా మాట్లాడుతుంటారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు వేర్పాటువాదులు స్వయంగా ప్రకటించుకున్న రిపబ్లిక్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా పుతిన్ గుర్తించారు. డొనబాస్ పూర్తిగా విముక్తి పొందడానికి తూర్పు ఉక్రెయిన్‌లో వారాల పాటు భీకర పోరు సాగుతోంది. రష్యా తాను బాంబు దాడులు చేసి ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల గురించి తన ప్రణాళికలపై క్రెమ్లిన్ మౌనంగా ఉంటోంది. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు తమ స్థితిగతులపై నిర్ణయించుకోవడం వారికే విడిచి పెడుతున్నామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ సెస్కోవ్ చెప్పారు. అయితే శత్రు సైన్యాలు ఈ వారం ఉక్రెయిన్ లోని దాదాపు 20 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధానికి ముందు క్రిమియా ద్వీపం, డొనబాస్ లోని కొన్ని భాగాలు 7 శాతం మాత్రమే రష్యా అధీనంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమై వంద రోజులు పూర్తయిన సందర్భంగా వీడియో మెసేజ్‌లో జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అంత సులభంగా లొంగిపోదని స్పష్టం చేశారు.
వందరోజులుగా తాము ఉక్రెయిన్‌ను రక్షించుకుంటున్నామని, విజయం తమ వైపే ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యుద్ధం పరిసమాప్తం కాడానికి చర్చలే పరిష్కారమార్గమని పేర్కొన్నారు. శాంతి కోసం ఉక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకుంటుందా ? అన్న ప్రశ్నకు బైడెన్ ఇది వారి భూభాగం. వారేం చేయాలో, ఏం చేయకూడదో తాను చెప్పలేనని తెలిపారు. రష్యా దాడి ప్రధాన లక్షం ఉక్రెయిన్ లోని చాలా భూభాగాన్ని కలుపుకోవడం కాదని తెలుస్తోంది. కీవ్‌లో మాస్కో అనుకూల ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగితే నాటోలో ఉక్రెయిన్ చేరకుండా నివారించడమౌతుందని, మరింత దూరంగా ఉంచడమౌతుందన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే రష్యా తన దండయాత్ర లాభాలను వదులుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.