Friday, November 15, 2024

చర్చలే శరణ్యం!

- Advertisement -
- Advertisement -

Plea In Supreme Court To Enforce Fundamental Duties ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత ప్రభుత్వం పాటిస్తున్న తటస్థ వైఖరిపై విస్తృత స్థాయి చర్చ జరుగుతున్నది. అమెరికాకు, రష్యాకు సమాన దూరం పాటించడం కోసమే ఉక్రెయిన్‌పై దాడిని భారత్ ఖండించలేదని స్పష్టపడుతున్నది. ఇది మన ఒకప్పటి అలీన విధానాన్ని తలపిస్తున్నది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా అమానుష, ఏకపక్ష యుద్ధాన్ని భారత్ నిర్దంద్వంగా ఖండించి వుండవలసిందని భావిస్తున్న వారు అధిక సంఖ్యలోనే వున్నారు. అలా చేయకపోడం ద్వారా ప్రధాని మోడీ అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్నారనే అభిప్రాయం కూడా వెలువడుతున్నది. రష్యాతో భారత్‌కు గల విశ్వసనీయమైన గత అనుబంధం రీత్యా తటస్థ విధానమే సరైనదని అనుకుంటున్నవారూ వున్నారు.

హిట్లర్ జర్మనీని ఓడించడం ద్వారా ప్రపంచాన్ని నాజీ ఫాసిజం నుంచి కాపాడిన రష్యా నాటో దురాక్రమణకు దొరికిపోయే స్థితి నుంచి తనను తాను కాపాడుకోడానికే తప్పనిసరి పరిస్థితుల్లో ఉక్రెయిన్ మీదికి వెళ్లిందనే కోణంలోనూ కొంత మంది ఆలోచిస్తున్నారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే అమెరికా, యూరప్ దేశాల క్షిపణి దాడుల పరిధిలోకి రష్యా వెళ్లిపోతుందని, నల్ల సముద్ర రేవులతో దాని సంబంధాలు తెగిపోతాయని వెల్లడవుతున్న భయాలను తప్పుపట్టలేము. అయితే శాంతియుత మార్గాల ద్వారా తగిన పరిష్కారాన్ని సాధించుకోడానికి ప్రయత్నించకుండా రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్‌ను కబళించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

చైనా విషయంలో అమెరికా తనకు ఎంత వరకు కలిసి వస్తుందో, అలాగే రష్యా నుంచి పొందగలుగుతున్నంత సులభంగా ఆయుధాలను ఇతర దిగుమతులను పాశ్చాత్య ప్రపంచం నుంచి, అమెరికా నుంచి పొందగలుగుతామో లేదో అనే మాదిరి అనుమానాలను భారత్‌ను పీడించడం సహజం. మిగ్ యుద్ధ విమానాల నుంచి ఎస్400 వరకు రష్యా నుంచి మనం అనేక రకాల యుద్ధ సామగ్రిని కొనుగోలు చేస్తున్నాము. అలాగని పూర్తిగా రష్యా వైపు మళ్లిపోయి అమెరికా, దాని మిత్రదేశాలతో సత్సంబంధాల అవసరాన్ని నిర్లక్షం చేసే స్థితిలో భారత దేశం లేదు. రష్యాను ఏకాకిని చేయడం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భారత్ తీసుకునే వైఖరికి విశేష ప్రాధాన్యముంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శనివారం నాడు ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడి భారత్ మద్దతును అర్థించారు. అయినా రష్యా దాడిని ఖండిస్తూ శనివారం నాడు భద్రతా మండలి తీర్మానాన్ని ప్రతిపాదించినప్పుడు భారత్ గైర్హాజరయింది. చర్యలే శరణ్యమని చెప్పింది. తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునే సరకుల్లో ముఖ్యమైనవి ఎరువులు.

అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు తీవ్రతరం చేస్తే ఏమవుతుంది అనేది ముఖ్యమైన ప్రశ్న. స్వల్ప అసౌకర్యాలు తప్ప రష్యాను ఆంక్షలు ఏమీ చేయలేవనే అభిప్రాయమే అధికంగా వినవస్తున్నది. అయితే రష్యా నుంచి పలు రకాల సామగ్రిని దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. అంతర్జాతీయ బ్యాంకింగ్ సందేశాల అనుసంధాన సంస్థ స్విప్ట్ నుంచి రష్యాను వెలివేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఈ వ్యవస్థతో ముడిపడి వున్న బ్యాంకులన్నీ పరస్పరం భారీ చెల్లింపులను నిష్పూచీగా జరుపుకొని అంతర్జాతీయ వాణిజ్యం నిరవరోధంగా జరిగేలా చూస్తున్నాయి. రష్యాను శిక్షించేందుకు దానిని ఈ వ్యవస్థ నుంచి తొలగిస్తే అక్కడి నుంచి గ్యాస్, ఆయిల్ అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్న యూరప్ దేశాలకే ఎక్కువ నష్టం కలిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. రష్యాపై ఆంక్షల వల్ల దానికి 5 శాతానికి మించి నష్టం వాటిల్లదని చెబుతున్నారు. మనవంటి దేశాలు దానితో రూపాయి ఖాతాలను తెరుచుకొని ఎరువులు తదితర దిగుమతులను సునాయాసంగా జరుపుకోవచ్చు. ఈ యుద్ధం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలను పెంచివేసింది. అది క్రూడ్‌ను అధికంగా దిగుమతి చేసుకునే మన వంటి దేశాలను విశేషంగా బాధిస్తుంది.

ఆంక్షల ద్వారా రష్యాను ఇబ్బంది పెట్టాలని, డాలరు మారక వ్యవస్థ నుంచి దానిని దూరంగా వుంచాలని అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసే కొద్దీ ప్రత్యామ్నాయ అంతర్జాతీయ కరెన్సీ వ్యవస్థలు రూపొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. రష్యా, చైనాలు చేరువయ్యే కొద్దీ నాటోకు మరో ప్రత్యామ్నాయ కూటమి తలెత్తడం, అమెరికా ఆధిపత్య ప్రపంచానికి మారుగా చైనా, రష్యా ప్రాబల్యంలోని ఇంకో వ్యవస్థ రూపుదిద్దుకోడం వంటివి వేగవంతమవుతాయి. ఆంక్షలతో ఎంతో కాలం రష్యాను ఇబ్బందుల్లో పెట్టే అవకాశాలూ తక్కువగా వుండి యుద్ధ విస్తరణ ప్రపంచానికి కనీవినీ ఎరుగని ముప్పు తీసుకు రాగలదనే స్పష్టత ఇంతగా కనిపిస్తున్నప్పుడు ఈ యుద్ధాన్ని ఇక్కడితో ఆపి చర్చల మార్గం వైపు రష్యా, ఉక్రెయిన్‌లను మళ్లించే చొరవ చోటు చేసుకోవాలి. ఇప్పటి పరిస్థితుల్లో అదొక్కటే మేలైన మార్గం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News