Thursday, December 19, 2024

పుతిన్ నోట చర్చల మాట!

- Advertisement -
- Advertisement -

20 మాసాలు నిండిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆధునిక ప్రపంచ నిత్య జీవనంలో అదీ ఒక భాగమైపోయింది. ఈ యుద్ధ వార్తలను ప్రజలిప్పుడు పట్టించుకోడం లేదు. ఈ స్తబ్ధ తను కొంచెం ఛేదిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాము శాంతి చర్చలకు వ్యతిరేకం కాదని, ఉక్రెయినే సహకరించడం లేదని బుధవారం నాడు అన్నారు. జి 20 పరోక్ష (వర్చువల్) సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంతకు ముందు ఢిల్లీలో జరిగిన జి20 అధిపతుల ప్రత్యక్ష సమావేశానికి పుతిన్ హాజరు కాలేదు. చర్చలకు తాను వ్యతిరేకిని కాదని ఆయన చెప్పుకొన్న సమయంలోనే రష్యా, ఉక్రెయిన్ రెండూ పరస్పర దాడులను ముమ్మరం చేసినట్టు వార్తలు వచ్చాయి. డజనుకి పైగా యుద్ధ డ్రోన్లను, ఒక క్షిపణిని రష్యా తమపై ప్రయోగించిందని, వాటిని కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళ అధికార్లు తెలియజేశారు. ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలపై గురి పెట్టి రష్యా దాడులు పెంచిందని చెబుతున్నారు. ఉక్రెయిన్ కూడా అమెరికా, యూరపు నుంచి తనకు అందుతున్న సాయంతో రష్యాపై తీవ్రంగానే పోరాడుతున్నది.

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో ఇంత వరకు 10 వేల మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ గణాంకాల సేకరణ ఇంకా జరుగుతున్నదని వాస్తవంలో ఈ సంఖ్య ఎక్కువగానే వుండవచ్చునని సమితి తెలియజేసింది. మృతుల్లో సగం మంది గత మూడు మాసాలలోనే యుద్ధానికి బలి అయిపోయారని సమితి వెల్లడించింది. మృతుల్లో బాలల సంఖ్య కూడా అపరిమితంగానే వుంది. యుద్ధం మొదలైన తర్వాత గత ఏడాది చలికాలంలో ఉక్రెయిన్ పౌరులు విపరీతంగా కష్టాలు ఎదుర్కొన్నారు. రష్యా దాడుల వల్ల 60 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు నిర్వాసితులై యూరపు దేశాలకు తరలిపోయారని తెలుస్తున్నది. పుతిన్ చెప్పినట్టు నిజంగానే రష్యా చర్చలను కోరుకొంటూ వుంటే అవి ఎందుకు జరగడం లేదు, ఎవరి మధ్య చర్చలు జరిగితే ఈ యుద్ధానికి తెరపడుతుంది అనేవి కీలకమైన ప్రశ్నలు. యుద్ధాన్ని విరమిస్తే ఎవరి షరతుల మీద జరగాలి అనేది ముఖ్యమైన అంశం. ఇంత కాలం ఎంతో ఖర్చు పెట్టి, అమెరికా ఆంక్షలకు గురవుతూ సాగిస్తున్న యుద్ధాన్ని తాను వీగిపోయే షరతుపై విరమించడానికి రష్యా బొత్తిగా సిద్ధపడదు.

అలాగే ఉక్రెయిన్ చేతులెత్తేసి తన మానాన తాను బతకడానికి నిర్ణయించుకొంటే అందుకు అమెరికా గాని, యూరపు దేశాలు గాని సమ్మతించవు, అనుమతించవు. ఉక్రెయిన్ లోని డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్, మైకోలాయువ్, జపోరిజ్యా, ఓబ్లాస్ట్ అనే ప్రాంతాలను రష్యా ఆక్రమించుకొని వున్నది. క్రిమియా 2014లోనే రష్యాలో భాగమైపోయింది. ఈ భూభాగాలన్నింటినీ తిరిగి సాధించుకోవాలని ఉక్రెయిన్ కోరుకోడంలో తప్పేమీ లేదు. అయితే రష్యా అందుకు అంగీకరిస్తుందా? పుతిన్‌ను అధికారం నుంచి తప్పించి యుద్ధానికి ముగింపు చెప్పే సామర్థం అమెరికాకు కలుగుతుందా? ఇది అంత సులభంగా తోచడం లేదు. మరి యుద్ధానికి ముగింపు ఎలా, ఎప్పుడు? ఐక్యరాజ్యసమితి అనే ఉత్సవ విగ్రహం వైఫల్యం పదే పదే రుజువు అవుతూనే వుంది. ఇది యుద్ధాల కాలం కాదు అని ప్రధాని మోడీ చేసిన ఉద్బోధ గాలిలో కలిసిపోయింది. దానిని చెవిన పెట్టేవారెవరూ లేరు. గాజాపై దాడులలో స్వల్ప విరామం సాధించిన పద్ధతిలోనే ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో కూడా ఆట విడుపు ఒప్పందాన్ని కుదర్చగలిగే శక్తియుక్తులు ఎవరికీ లేవు. రెండు వైపులా అలసిపోయి ఇక చాలిద్దాం అనుకొనే పరిస్థితిని ఊహించలేము. ఉక్రెయిన్‌కు అదే పనిగా విరాళాలు, సైనిక సాయం అమెరికా, యూరపు దేశాల నుంచి లభిస్తున్నది.

మొన్న మంగళవారం నాడే జర్మనీ 1.3 బిలియన్ యూరో (1.4 బిలియన్ డాలర్లు) ల సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు ప్రకటించింది. రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న సాహసోపేతమైన, ఖరీదైన పోరాటాన్ని ఆరాధనా పూర్వకంగా సమర్థిస్తున్నాం, దాని పట్ల సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ చేసిన ప్రకటన ఈ యుద్ధం ఇప్పట్లో చివరికి చేరే అవకాశాలు లేవనే అభిప్రాయాన్ని మరింత దృఢ పరుస్తున్నది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్ ఉక్రెయిన్ రాజధానిని ఇటీవలే సందర్శించారు. ఉక్రెయిన్‌లో రష్యా మద్దతు గల అధ్యక్షుణ్ణి తొలగించిన ఘట్టానికి పదేళ్ళు నిండిన సందర్భంగా దానికి సంఘీభావంగా యూరపు దేశాల ప్రతినిధులు కీవ్‌ను సందర్శిస్తున్నారు. కాబట్టి ఇది కేవలం రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎంత మాత్రం కాదు. రష్యాకు, అమెరికా, దాని మిత్ర పక్షాలకు సాగుతున్న ప్రాబల్య సంఘర్షణ ఇది. ఇదిలా కొనసాగినంత కాలం మానవాళికి మంచి జరగదు. చైనా చొరవతో, అమెరికా మద్దతుతో చర్చలకు అవకాశాలు ఎప్పటికైనా అంకురిస్తాయేమో వేచిచూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News