రాజధాని కీవ్, ఒడెస్సా, డినిప్రోపెట్రోవిస్క్లలో నిలిచిన విద్యుత్ సరఫరా
అత్యవసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం
చీకట్లో భయంభయంగా గడుపుతున్న కోట్లాది మంది
ఇటీవల ఉక్రెయిన్ దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగంపై రష్యా సీరియస్
కీవ్ : రష్యా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి (ఐసిబిఎం)తో ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి. ఉభయ దేశాల మధ్య దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రష్యా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తరువాత ఉక్రెయిన్‌లో కోట్లాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్, ఒడెస్సా, డినిప్రోపెట్రోవిస్క్లలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర వస్తువుల సరఫరాపై అది తీవ్ర ప్రభావం చూపింది. దీనితో ప్రజలు ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
అమెరికా తయారీ దీర్ఘ శ్రేణి క్షిపణులు ఎటిఎసిఎంఎస్లను ఉక్రెయిన్ ప్రయోగించడాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా గురువారం ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణిని ప్రయోగించి తమ ఉద్దేశాన్ని చాటి చెప్పింది. తనపై పశ్చిమ దేశాల క్షిపణుల ప్రయోగానికి అనుమతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా, దాని మిత్ర దేశాలను రష్యా కొన్ని నెలలుగా హెచ్చరిస్తూ వస్తోంది. అయినప్పటికీ రష్యా భూభాగంపైకి ఎటిఎసిఎంఎస్లు పరీక్షించేందుకు బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చింది. ఆ వెంటనే ఉక్రెయిన్ వాటిని ప్రయోగించింది. దీనితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన మాస్కో నాయకత్వం ఖండాంతర క్షిపణిని ప్రయోగించి కీవ్‌కు హెచ్చరికలు జారీ చేసింది.