బ్రసెల్స్ : రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి వచ్చేవారం సౌదీ అరేబియాలో అమెరికాఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. గురువారం రాత్రి ఆయన ఈ విషయమై మాట్లాడుతూ సోమవారం తాను సౌదీ అరేబియాకు వెళ్తానని, తన బృందం అమెరికా అధికారులతో చర్చలు జరపడానికి అక్కడ ఉంటుందని చెప్పారు. వచ్చేవారం అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరగనున్నందున అంతకుముందు సౌదీ రాజుమొహమ్మద్ బిన్ సాల్మన్ కలుసుకోడానికి తాను సౌదీ అరేబియా వెళ్తున్నానని, ఆ తరువాత తమ అధికారుల బృందం అమెరికా భాగస్వాములతో చర్చించడానికి అక్కడ ఉంటుందని చెప్పారు, శాంతి విషయంలో ఉక్రెయిన్ చాలా ఆసక్తిగా ఉందన్నారు. గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కోఫ్ వచ్చేవారం సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌తో చర్చలు జరపడానికి ప్లాను చేస్తున్నామని చెప్పారు.
గత శుక్రవారం శ్వేతభవనంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ జరిగిన భేటీలో తీవ్ర వాగ్యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ముగిసిన తరువాత జెలెన్‌స్కీ క్షమాపణ చెబుతూ రాసిన లేఖకు ట్రంప్ సంతృప్తి చెందారని స్టీవ్ చెప్పారు. జెలెన్‌స్కీ లేఖ సానుకూలమైన మొదటి అడుగుగా అభివర్ణించారని పేర్కొన్నారు. అమెరికా రక్షణ మంత్రి మార్కో రుబియో తదితరులు మంగళవారం రియాద్‌కు బయలుదేరవచ్చు. జెలెన్‌స్కీ ప్రధాన సహాయకులు ఆండ్రీ యెర్మార్క్ కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే నెల ట్రంప్ కూడా సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ట్రంప్ వెల్లడించారు. అమెరికన్ కంపెనీల విస్తరణకు 1 ట్రిలియన్ డాలర్లతో సౌదీ అరేబియాతో ఒప్పందం కుదిరిందని ట్రంప్ చెప్పారు.