Friday, December 20, 2024

యుద్ధానికి తెర దించేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 24 కిందటేడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలు పెట్టిన రోజు. ఆ తరువాత రోజులు గడిచాయి. యుద్ధం ప్రారంభమై ఏడాది కావస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే రష్యా -ఉక్రెయిన్ యుద్ధం మరి కొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధ రంగంలో రష్యాకు దీటుగా బదులిస్తున్న ఉక్రెయిన్‌కు ఇప్పటివరకు అనేక పశ్చిమ దేశాలు ఆయుధాలిచ్చి సాయం చేశాయి. అయితే ఇవన్నీ డిఫెన్స్ కోసమే పనికొచ్చాయన్నది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వాదన. రష్యా బలగాలపై ఎదురుదాడి చేయడానికి అత్యాధునిక ఆయుధాలు ముఖ్యంగా ఎంఒన్ అబ్రామ్స్, లెపర్డ్ టూ యుద్ధ ట్యాంకులు ఇవ్వాలని కొంత కాలంగా ఆయా దేశాలపై ఉక్రెయిన్ ఒత్తిడి తీసుకు వస్తోంది. అయితే ఈ యుద్ధ ట్యాంకులు ఇవ్వడానికి మొదట్లో అమెరికా, జర్మనీ అంగీకరించలేదు. దీని వల్ల అంతిమంగా అణ్వాయుధ యుద్ధం వస్తుందని భయపడ్డారు.

ఈ నేపథ్యంలో నాటో కూటమిలో తేడాలు కూడా వచ్చాయి. అయితే చివరకు కథ సుఖాంతమైంది. ఉక్రెయిన్ కోరిన యుద్ధ ట్యాంకులు ఇవ్వడానికి అగ్ర రాజ్యాలు అంగీకరించాయి. అమెరికా నుంచి 30 ఎంఒన్ అబ్రామ్స్ ట్యాంకులు, జర్మనీ నుంచి 14 లియోపార్డ్ 2 యుద్ధ ట్యాంకులు అతి త్వరలో ఉక్రెయిన్‌కు అందుతాయి. ఈ రెండు యుద్ధ ట్యాంకులు చాలా శక్తివంతమైనవి. యుద్ధరంగంలో శత్రువులను దెబ్బ తీయడానికి అత్యంత అధునాతన టెక్నాలజీ తో రూపొందించిన యుద్ధ ట్యాంకులు ఇవి. దీంతో రష్యాఉక్రెయిన్ యుద్ధం కొత్త రూపందాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది తమను రెచ్చగొట్టడమే అవుతుందన్నారు రష్యా నాయకులు.

నాటో కూటమే చిచ్చుపెట్టిందా?

నాటో కూటమిలోకి ప్రవేశించడానికి ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలే మౌలికంగా రష్యా దాడులు చేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌లోకి నాటో కూటమి సేనలు ప్రవేశిస్తే తమ దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తుందనేది రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదన. దీంతో నాటో సేనల నుంచి రష్యాను కాపాడుకోవడానికే ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టినట్లు పుతిన్ తన వాదన వినిపించారు. అయితే రష్యా సేనల దాడులు తీవ్రతరం కావడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశ ప్రయోజనాల రీత్యా రెండు నిర్దిష్ట ప్రతిపాదనలు చేశాడు. మొదటిది… నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ ఎలాంటి ప్రయత్నం చేయదు.రెండోది ఉక్రెయిన్‌లోని రష్యా జాతీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై రాజీకి సిద్ధం. వాస్తవానికి ఈ రెండు ప్రతిపాదనలు చాలా కీలకమైనవి. రష్యా సేనల దాడికి భయపడి కావచ్చు.. మరో కారణంతో కావచ్చు ఉక్రెయిన్ ఒకటి కాదు… నాలుగు అడుగులు వెనక్కి వేసినట్లే. జెలెన్ స్కీ మెట్టుదిగి కీలకమైన ప్రతిపాదనలు చేసినా రష్యా దాడులు ఆగలేదు. ఉక్రెయిన్ యుద్ధంతో నాటో దేశాలకు ఒక గుణపాఠం చెప్పాలనేది పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో రష్యా చుట్టుపక్కల ఏ దేశమైనా నాటో కూటమి పేరు ప్రస్తావించడానికి కూడా భయపడాలి అన్నట్లుగా ఉంది పుతిన్ తీరు. పుతిన్ ఇంత దూకుడుగా ఉన్నా ఆయనను అదుపులో పెట్టడానికి అమెరికా సహా ఏ అగ్రరాజ్యం ప్రయత్నించలేదన్న విమర్శలున్నాయి. ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యా మిలిటరీపరంగా బాగా శక్తివంతమైన దేశం. ఏడాదిగా జరుగుతున్న యుద్ధంలో సహజంగా రష్యానే పైచేయి సాధించింది. ఉక్రెయిన్ టోటల్‌గా డిఫెన్స్‌లో పడింది.

యుద్ధం అంటే అంతులేని విషాదమే!

యుద్ధం ఎప్పుడూ వేడుక కాదు. అంతులేని విషాదమే. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు అంతులేని విషాదాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే హింసకు తావులేని సమాజాన్ని ప్రపంచం కోరుకుంది. శాంతి కోసం పరితపించింది. జెలెన్ స్కీ నాలుగు అడుగులు వెనక్కితగ్గినా ఉక్రెయిన్‌పై దాడులు ఆపడానికి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సిద్ధం గా లేకపోవడం ప్రపంచ శాంతిని కోరేవారికి కలవరం కలిగిస్తోంది. ఒక పరిణతి చెందిన దేశాధ్యక్షుడిలా పుతిన్ ప్రవర్తించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక యుద్ధోన్మాదిలా పుతిన్ ప్రవర్తిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అయితే పుతిన్ ఇంతగా పేట్రేగిపోతున్నా ఆయనను అదుపులో పెట్టడానికి అమెరికా సహా ఏ దేశమూ ప్రయత్నించడం లేదు. కేవలం ఆర్థిక ఆంక్షలు విధించి చేతులు దులుపుకుంటున్నాయి. జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్న పుతిన్ వార్నింగ్ కు ఆయా దేశాలు భయపడి కూడా ఉండొచ్చు.

పాలకుల కర్తవ్యం ఏమిటి?

భూగోళం మీద ఎక్కడ ఏం జరిగినా… తగుదునమ్మా అని జోక్యం చేసుకునే అగ్రరాజ్యం అమెరికా వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్‌పై దాడులు నిలుపుదల చేయించడానికి ప్రపంచ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించే అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తమ పౌరులు బావుంటే చాలునని అమెరికా అనుకుంటోంది. జో బైడెన్ కాకుండా డోనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉండి ఉంటే యుద్ధాన్ని ఆపడానికి చొరవ చూపి ఉండేవారన్న అభిప్రాయం కూడా చాలా చోట్ల వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంధి ప్రయత్నాలు చేయాలి. పిల్లిమెడలో గంట కట్టడానికి అమెరికా సహా అన్ని దేశాలు ముందుకు రావాలి. యుద్ధం అంటే తప్పకుండా ఒక విధ్వంసమే. మరో ముచ్చటే లేదు. రెండు ప్రపంచ దేశాల యుద్ధాల్లో మానవాళి ఎంతో నష్టపోయింది. మన కళ్ల ముందు ఉక్రెయిన్ మరుభూమిగా మారుతుంటే మిగతా దేశాలు మౌనాన్ని ఆశ్రయించడం ఏ మాత్రం సమంజసం కాదు. ఎక్కడో ఒక చోట.. ఎవరో ఒకరు కదలాలి. రష్యా అధినేత పుతిన్‌ను ఒప్పించగలగాలి. దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడుకోవాలి.

ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News