వాషింగ్టన్: రష్యా దళాలపై దాడికి సంబంధించిన అమెరికా, నాటో రహస్య ప్రణాళికలను తెలిపే యుద్ధపత్రాలు లీక్ అయ్యాయి. రహస్య యుద్ధపత్రాలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయని సీనియర్ బైడెన్ పాలన అధికారులు తెలిపారు. ట్విట్టర్, టెలిగ్రామ్‌లో కనిపించిన పత్రాల లీక్ వెనుక ఎవరు ఉన్నారనేదానిపై పెంటగాన్ దర్యాప్తు చేస్తోంది. కాగా పత్రాలు వాటి అసలు ఫార్మాట్ నుంచి కొన్ని భాగాలను సవరించినట్లు తెలుస్తోందని మిలటరీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మరణించివారి అమెరికా అంచనాలు, రష్యాదళాల మరణించినవారి అంచనా తక్కువగా ఉంచినట్లు విశ్లేషకులు తెలిపారు. అయితే ఆయుధాల డెలివరీలు, సైనిక దళాలు, బెటాలియన్ బలాలు, ఇతర ప్రణాళికలకు చెందిన అసలు పత్రాలు బహిర్గతమయ్యాయి. ఉక్రెయిన్‌కు సహాయంచేసే క్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఉల్లంఘనలను పత్రాలు సూచిస్తున్నాయి. బైడెన్ అధికార యంత్రాంగం తొలిగించేందుకు కృషిచేసినా గురువారం సాయంత్రంనాటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ సందర్భంగా పెంటాగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టుల నివేదికల గురించి తెలిసిందని ఈ అంశాన్ని పెంటగాన్ సమీక్షిస్తోందన్నారు. అయితే ఉక్రెయిన్ తమ దాడిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించాలనుకుంటుందో తదితర నిర్దిష్ట యుద్ధ ప్రణాళికలు ఆ డాక్యుమెంట్లు తెలపలేదు. పత్రాలు ఐదువారాల పాతవిగా అధికారులు గుర్తించారు. అమెరికా సరఫరా చేసిన హై మొబిలిటి ఫిరంగి రాకెట్ వ్యవస్థలు, మందుగుండు సామాగ్రి, మౌలిక సదుపాయాలు, లక్షాల దూరం, ఉక్రెయిన్ దళాలు ఆయుధాలను ఎంతవేగంగా ఉపయోగి స్తున్నాయో పత్రాలు తెలుపుతున్నాయి. ఈ పత్రాలు ప్రామాణికమైనవి అయినా కాకపోయినా జాగ్రత్త వహించాలి అని అర్లింగ్టన్‌లోని పరిశోధన సంస్థ సిఎన్‌ఎ రష్యన్ అధ్యయనాల డైరెక్టర్ మైఖేల్ కోఫ్మాన్ అన్నారు. 16వేల నుంచి 17,500 రష్యన్ సైనికులు మరణించారని, ఉక్రెయిన్ 71,500మంది సైనికులు మరణించారని పేర్కొన్నారు.
పెంటగాన్ ఇతర విశ్లషకులు రష్యా చాలా ఎక్కువ ప్రాణనష్టానికి గురైందని అంచానా వేశారు. దాదాపు రెండులక్షలమంది మరణించడం, గాయపడ్డారని అదేవిధంగా ఉక్రెయిన్‌వైపు లక్షమందికిపైగా మరణించడం లేదా గాయపడి ఉండొచ్చని అంచనా వేశారు. ఓ డాక్యుమెంట్‌లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు రూపొందించిన షెడ్యూళ్లలో ఉక్రెయిన్ ట్రూప్ యూనిట్లు , ఆయుధ సామగ్రి, శిక్షణ జాబితా వివరాలు ఉన్నాయి. ఈ పత్రంలో 12బ్రిగేడ్ దళాల సమచారం ఉంది. వీటిలో తొమ్మిది యూఎస్, ఇతర నాటో మిత్రదేశాలచే శిక్షణ పొందినవి, సరఫరా చేసినవి. కాగా తొమ్మిది బ్రిగేడ్ దళాల్లో ఆరు మార్చి మిగిలినవి ఏప్రిల్ 30నాటికి సిద్ధంగా ఉంటాయని లీకైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ బ్రిగేడ్‌లో దాదాపు 4వేల నుంచి 5వేల సైనికులు ఉన్నారని విశ్లేషకులు తెలిపారు. తొమ్మిది బ్రిగేడ్‌లకు అవసరమైన మొత్తం యుద్ధ సామగ్రి, 250కంటే ఎక్కువగా యుద్ధ ట్యాంకులు, 350కంటే ఎక్కువ మెకనైజ్డ్ వాహనాలు ఉన్నాయని పత్రాలు తెలుపుతున్నాయి.