Monday, December 23, 2024

నివురుగప్పిన నిప్పులా ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

Ukrainian president calls on Putin to come to talk

వేర్పాటువాదులు, ఉక్రెయిన్ సైన్యం మధ్య కొనసాగుతున్న దాడులు
చర్చలకు రావాలని పుతిన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు
ఐరోపాలో అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా
భారీ మూల్యం తప్పదని బ్రిటీష్ ప్రధాని జాన్సన్ హెచ్చరిక
కీవ్‌కు విమాన సర్వీసులు నిలిపేసిన లుఫ్తాన్సా

కీవ్: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయానక వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ సైనికులు, రష్యా వేర్పాటువాదుల మధ్య ఫిరంగుల దాడులు కొనసాగుతుండడం, తూర్పు ఉక్రెయిన్‌నుంచి వేలాది మందిని ఖాళీ చేయించడంతో దీన్ని సాకుగా తీసుకొని ఏ క్షణంలోనైనా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చనే భయాలు మరింత పెరిగాయి. వేర్పాటువాదుల దాడుల్లో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు మృతి చెందారు. దీనికి తోడు రష్యా అణు క్షిపణులను పరీక్షించడం కూడా అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి సిద్ధమవుతోందని అమెరికా, పలు యూరప్ దేశాలు హెచ్చరిస్తున్నాయి.

ఉక్రెయిన్‌కు మూడు వైపులా రష్యా లక్షన్నర మంది సైనికులతో పాటుగా యుద్ధ విమానాలు, యుద్ధ పరికరాలను మోహరించింది. అయితే ఒక వేళ ఉక్రెయిన్‌పై దాడి చేస్తే రష్యాపై కఠినాతి కఠినమైన ఆర్థిక ఆంక్షలు తప్పవని ఈ దేశాలు హెచ్చరిస్తున్నా రష్యా మాత్రం ఆ హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. దీంతో వివాదం మరింత జటిలంగా మారింది. ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. సంక్షోభ నివారణ కోసం చర్చలకు రావాలని ఆహ్వానించారు. చర్చలకు వేదికను మీరే నిర్ణయించండని కూడా ఆయన కోరారు. అయితే దీనిపై రష్యానుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

విమాన సర్వీసులను నిలిపి వేసిన లుఫ్తాన్సా

ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రాజధానికి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు జర్మనీ ఎయిర్‌లైన్స్ సంస్థ లుఫ్తాన్సా ప్రకటించింది. సోమవారంనుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటుగా కీలకమైన ఒడిసా పోర్టు సిటీకి కూడా విమానయాన సేవలను అందించలేమని సంస్థ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్య ఏ క్షణంలోనూనా దాడి చేయవచ్చనే ప్రచారం జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ మా సిబ్బంది, ప్రయాణికుల ప్రాణ రక్షణకే ఎల్లవేళలా అత్యధిక ప్రాధాన్యం’ అని లుఫ్తాన్సా పేర్కొంది. ఐరోపాలో అతి పెద్ద యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించిన సమయంలోనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఫిబ్రవరి చివరి వరకుమాత్రం ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తామని తెలిపింది. మ్యూనిచ్‌నుంచి బ్రిటన్‌కు చెందిన ఆంగ్ల పత్రిక బిబిసితో మాట్లాడుతూ బోరిస్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం అనంతరం జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా కీవ్‌లోను తమ సిబ్బందిని బ్రసెల్స్, తూర్పు ఉక్రెయిన్ నగరం ల్వివ్‌కు తరలిస్తున్నట్లు ఉక్రెయిన్ రాజధానిలోని నాటో లైజన్ కార్యాలయం ప్రకటించింది. మరోవైపు అనివార్యంగా మారుతున్న యుద్ధాన్ని నిలుపుదల చేయడానికి చివరి క్షణం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం ముందు నిర్ణయించిన ప్రకారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఆదివారం టెలిఫోన్‌లో సంభాషణ ప్రారంభమైనట్లు స్థానిక మీడియా ప్రకటించింది. అయితే వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్( నాటో)లో ఉక్రెయిన్ ఎన్నటికీ చేరదన్న రాతపూర్వకమైన హామీపై మాత్రమే తమ బలగాలు వెనక్కి తగ్గుతాయని పునరుద్ఘాటించడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News