కీవ్ : మాతృభూమిని రక్షించుకోడానికి ఆయుధం పట్టి యుద్ధం లోకి దిగిన ఉక్రెయిన్ యువనటుడు పాషా లీ (33)రష్యా సైనికుల కాల్పుల్లో నేలకొరిగాడు. క్రిమియాలో జన్మించిన పాషాలీ , ఉక్రెయిన్‌లో అనేక సినిమాల్లో నటించాడు. గత నెలాఖరులో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభించిన తరువాత ఉక్రెయిన్ను కాపాడుకోడానికి పౌరులంతా సైన్యంలో చేరాలని , అవసరమైతే ఆయుధాలు అందిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇచ్చిన పిలుపుకు స్పందించాడు. సాయుధ బలగాల్లో చేరాడు. కీవ్ శివారు లోని ఇర్ఫిన్ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులతో కలిసి పోరులో దూకాడు. ఆదివారం రాత్రి ఇర్ఫిన్ ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో షెల్లింగ్‌లో పాషాలీ మరణించాడు. మరణించడానికి కొద్ది గంటల ముందు పాషాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఉక్రెయిన్ కోసం మేం ఏదైనా చేయగలం. అందుకే మేం నవ్వుతూ ఉన్నాం. అని రాసుకొచ్చాడు.