ప్రెజ్మ్‌సల్ (పోలెండ్): రష్యాదాడితో భయాందోళన చెందుతున్న ఉక్రేనియన్లు తమ రక్షణ కోసం ఇరుగుపొరుగు దేశాలకు తరలిపోతున్నారు. సైనికులుగా అర్హులైన పురుషులను ఉక్రెయిన్ దాటి వెళ్లొద్దని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆంక్షలు విధించిన తరువాత అత్యధిక సంఖ్యలో మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇతర దేశాలకు తరలివెళ్తుండడం కనిపిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దు దాటే లోగా రైళ్లలో ఎవరైనా పురుషులు ఉంటే వారిని కిందకు దింపివేస్తున్నారని ఉక్రెయిన్ రాజధాని కీవీ నుంచి వచ్చిన ఒక మహిళ చెప్పింది. 48 గంటల్లో ఉక్రెయిన్‌ను విడిచివచ్చిన శరణార్థులు 50,000 మంది కన్నా ఎక్కువే ఉంటారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ఫిలిప్పోగ్రాండి పేర్కొన్నారు. ఎక్కువ మంది పోలాండ్, మోల్డోవా తరలివెళ్తున్నారు. పోలాండ్, స్లొవేకియా, రొమేనియా, మోల్డోవ తదితర దేశాల వారు ఉక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం, ఆహార వసతి, న్యాయసహాయం అందిస్తున్నారు. సరిహద్దు ఆంక్షలను సడలించి వారికి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్థులందర్నీ ఇప్పుడు ఆదుకుంటామని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలనెనా బేయర్‌బాక్ చెప్పారు.