Wednesday, January 22, 2025

బిజెపిపై ఉమా భారతి ధ్వజం!

- Advertisement -
- Advertisement -

కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బిజెపి తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా అంటే తమ మనోభావాలను దెబ్బ తీశారని, తమ దేవుళ్లను కించపరుస్తున్నారని ఆ పార్టీ నేతలు, హిందూత్వ శక్తులుగా చెప్పుకొనేవారు వీధులకు ఎక్కుతారు. కానీ బిజెపి నేత, మధ్యప్రదేశ్ మాజీ సిఎం, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి ‘రాముడు, హనుమంతుడు బిజెపి కార్యకర్తలు కాదు, బిజెపికి వారి మీద మేథోపరమైన (పేటెంట్) హక్కు లేదు’ అంటే ఎక్కడా మనోభావాలు దెబ్బతిన్న దాఖలాలు లేవు. వీధుల్లో నిరసనలూ, మీడియాలో ప్రకటనలు లేవు, సన్యాసినులుగా ఉన్నవారు అలా మాట్లాడతారు, పట్టించుకోనవసరం లేదని బిజెపి నేత సమర్ధనకు దిగారు.

అంటే కాషాయ దుస్తులు వేసుకున్నవారు, హిందూత్వ శక్తులుగా ఉన్న వారు ఏం మాట్లాడేందుకైనా వారికి పేటెంట్ హక్కు ఉన్నదని అనుకోవాలా? ఇక సన్యాసిని ఉమా భారతి సంగతి కొస్తే రాముడు, హనుమంతుడు, పేటెంట్ గురించి మూడు దశాబ్దాల దీక్ష తరువాత ‘అక్కమ్మ’గా మారి ఇప్పుడెందుకు మాట్లాడినట్లు? డిసెంబరు 25వ తేదీన ఆమె భోపాల్ పట్టణంలో లోధీ సామాజిక తరగతికి చెందిన వివాహ వయసు వచ్చిన యువతీ, యువకుల సమావేశంలో మాట్లాడారు. ఆమె ప్రవచించిన అంశాల వీడియో రెండు రోజుల తరువాత సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చింది. దాని మీద వచ్చిన వార్తలకు, తరువాత ప్రకటనల మీద మచ్చుకు కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి. ‘ప్రభువు రాముడు, హనుమంతుడు బిజెపి కార్యకర్తలు కాదు: కాషాయ పార్టీపై అలిగిన ఉమా భారతి ధ్వజం’ ఇండియా టు డే. ‘ప్రభువు రాముడు, హనుమంతుడిపై బిజెపికి పేటెంట్ లేదు: కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి’ టైవ్‌‌సు ఆఫ్ ఇండియా. ‘రాముడు, హనుమంతుడిపై పేటెంట్ హక్కు లేదు: బిజెపిపై ఉమా భారతి వ్యాఖ్య’ హిందూస్తాన్ టైవ్‌‌సు.

ఉమా భారతి ఆ సమావేశంలోనూ విడిగా ట్వీట్ల ద్వారా, ఇతరంగా వెలిబుచ్చిన అంశాల సారం ఇలా ఉంది. రాముడు, హనుమంతుడిని తన స్వంతం చేసుకో చూస్తున్న బిజెపిపై ఉమా భారతి ధ్వజమెత్తింది. జన సంఘానికి (జనతా పార్టీ నుంచి ఏర్పడిన బిజెపి పూర్వ పార్టీ) ముందే మొఘలులు, బ్రిటీష్‌వారు రాకముందే ఈ దేవతలు ఉన్నా రు. వారికి కులం, మతం లేదు. వారిని ఇతరులెవరూ పూజించ రాదనే తప్పుడు భావనను బిజెపి వదులుకోవాలి. బిజెపి వేదిక నుంచి అందరినీ ఓటు అడుగుతాను.లోధీ సామాజిక తరగతి అన్ని వైపులా పరికించి తమకు ఏది ప్రయోజనమో చూసుకొని ఏ పార్టీ వారికైనా ఓటు వేసుకోవచ్చు. మీరు బిజెపి కార్యకర్తలు కాకుంటే రాజకీయ బంధాలేమీ లేవు. రాముడు, త్రి వర్ణాలు, గంగ, ఆవు మీద తనలో భక్తిని పెంపొందించింది బిజెపి కాదు, అది తనలో అంతకు ముందే అంతర్లీనంగా ఉంది. విశ్వాసాన్ని రాజకీయ లబ్ధికి అతీతంగా చూడా లి. ఉమా భారతి చెప్పిన అంశాలను కాంగ్రెస్ స్వాగతించింది.

బిజెపి ప్రతినిధి పంకజ్ త్రివేది స్పందిస్తూ ఎలాంటి కారణం లేకుండానే కాంగ్రెస్ ఉద్వేగపడుతున్నది. ఉమా భారతి ఒక సన్యాసిని, ఆమె అలాగే మాట్లాడతారు. ఆమె రాముడు అదే విధంగా బిజెపికి అంకితమైన విశ్వాస పాత్రురాలు. కాంగ్రెస్ అనవసరంగా సంతోషపడుతున్నది అన్నారు. ఉమా భారతి ఎంపిగా ఉంటూనే బాబరీ మసీదు కూల్చివేతకు ముందు 1992లో సన్యాసినిగా మారారు.‘వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్నందున ఆశాభంగం చెందిన ఉమా భారతిని శాంతింపచేయటం తప్పనిసరి అంటూ పత్రికలు విశ్లేషించాయి. లోధీ సామాజిక తరగతి బిజెపికి ఓటు వేయాలన్న కట్టుబాటేమీ లేదన్న ఆమె ప్రకటన ఆ పార్టీకి శుభవార్త కాదు. లోధీ సామాజిక తరగతి సమావేశంలో మాట్లాడిన అంశాల మీద నాలుగు రోజుల తరువాత ఆమె స్పందిస్తూ అలాగే మాట్లాడినందున వాటిని ఖండించాల్సిన అవసరం లేదన్నారు. కొంత కాలంగా రాష్ర్ట బిజెపిలో ప్రచ్ఛన్న పోరు సాగుతోంది.
2003 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు.

అంతకు ముందు పదేండ్ల పాటు సాగిన కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ పాలనపై తలెత్తిన అసంతృప్తి, కేంద్రంలో వాజ్‌పేయీ సర్కార్ ఉండటం, ఉమా భారతి రెచ్చగొట్టే ప్రసంగాలు అన్నీ కలసి బిజెపిని అధికారానికి తెచ్చాయి. సిఎంగా ఉమా భారతిని చేశారు. అయితే ఆ పదవి ఎనిమిదిన్నర నెలల ముచ్చటగానే ముగిసింది. 1994లో కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన మత కొట్లాటల కేసులో ఆమెకు అరెస్టు వారంటు రావటంతో రాజీనామా చేయక తప్పలేదు. తరువాత తాను తిరిగి పదవి చేపట్టే వరకు తనకు విధేయులను సిఎం గద్దెపై కూర్చోపెట్టాలన్న డిమాండ్ మీద తలెత్తిన ముఠా కుమ్ములాటల్లో ఆమె గురువుగా భావించిన అధినేత ఎల్‌కే అద్వానీతో బహిరంగంగా గొడవపడి చివరకు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తరువాత అసలు సిసలు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో పని చేస్తానంటూ భారతీయ జనశక్తి పార్టీని ఏర్పాటు చేశారు. జనంలో ఆదరణ లేకపోవటంతో దాన్ని తిరిగి బిజెపిలో విలీనం చేశారు. ఆమెను మధ్యప్రదేశ్ బిజెపికి దూరంగా పెట్టేందుకు ఉత్తరప్రదేశ్‌కు పంపారు.

అక్కడ ఆమె 2012 లో అసెంబ్లీకి, తరువాత 2014లో ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి లోక్‌సభకు ఎన్నికయారు. కొంతకాలం కేంద్రమంత్రిగా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బిజెపి ఓడింది. తాను తిరిగి రాష్ర్ట రాజకీయాల్లోకి రావాలని చూసిన ఉమా భారతిని అక్కడి నేతలు అంగీకరించలేదు. దాంతో తాను 2019 ఎన్నికల్లో పోటీ చేసేది లేదని అమె బెట్టు చేశారు. ఇదే అదునుగా భావించి సరే మీ ఇష్టం మీ మనోభావాన్ని గౌరవిస్తున్నాం అన్నట్లుగా మరో మాట, బుజ్జగింపుల వంటివేమీ లేకుండా ఆమెను పక్కనపెట్టారు. తరువాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి బిజెపి తిరిగి మధ్యప్రదేశ్‌లో పాగా వేసింది. మరో సారి ఉమా భారతిని వ్యతిరేకించే శివరాజ్ సింగ్ చౌహాన్ సిఎం గద్దెపై కూర్చున్నారు. అప్పటి నుంచి ఆమె తన నిరసన గళాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు.

మద్యనిషేధం విధించాలంటూ గతేడాది మార్చి నెలలో ఒక షాపుపై దాడి చేసిన వారిలో అనుచరులతో పాటు ఆమె కూడా ఉన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకే తానా పని చేశానని ఆమె సమర్ధించుకున్నారు. అప్పటి నుంచి చౌహాన్‌తో అసలు మాటల్లేవని వార్తలు. తరువాత బ్రాహ్మణుల మీద అనుచితంగా మాట్లాడారంటూ ఆమె బంధువు ప్రీతవ్‌ు సింగ్ లోధీని ఆగస్టు నెలలో బిజెపి నుంచి బహిష్కరించారు. ఆమె మేనల్లుడు రాహుల్ సింగ్ లోధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు సమాచార మిచ్చారనే కేసులో డిసెంబరు నెలలో ఎన్నికను హైకోర్టు కొట్టి వేసింది. ఈ పూర్వరంగంలో ఆమె లోధీ సామాజిక తరగతిని వేరే దారి చూసుకోమని చెప్పిన మాటలు బిజెపిలో కుమ్ములాటలను మరింతగా పెంచుతాయి. రాష్ర్టంలో ఒబిసి తరగతుల్లో సగం మంది ఉన్న ఈ సామాజిక తరగతి బుందేల్ ఖండ్, ఇతర ప్రాంతాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేదిగా ఉంది.

తనకు దక్కాల్సిన సిఎం పీఠాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ అధిష్టించారన్న కసితోఉన్న ఉమా భారతి ఒక సందర్భంలో బచ్చా చోర్ అన్నారు. అంతేకాదు, నేను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని మరొకరు నడుపుతున్నారంటూ బహిరంగంగానే చెబుతారు. ఆమె ఎంతగా రెచ్చగొట్టినా ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్నకు అనేక అంశాలున్నాయి. ఆమె నోటి దురుసుతనం పార్టీలో ఆమె స్థానాన్ని తగ్గించింది. గతంలో స్వంత పార్టీని పెట్టి తన బలహీనతను వెల్లడించుకున్నారు. ఇప్పుడు అంతకంటే బలమైన నేతలు పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ ఏవైనా చర్యలు తీసుకుంటే ఆమెకులేని ప్రాధాన్యతను ఇచ్చినట్లవుతుంది. ప్రస్తుత సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మీద పార్టీలో, జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. అతను కూడా ఒబిసి సామాజిక తరగతికి చెందిన వారే. ఈ స్థితిలో మరో ఒబిసి లోధీ సామాజిక తరగతిలో ఓట్లకు గండిపడితే నష్టం కనుక పొమ్మనకుండానే పొగబెట్టినట్లుగా చేస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప తేడాతో గద్దె దిగిన బిజెపి మరో చోట ఒక్క ఓటును కూడా వదులుకోదు. తన ఎదుగుదలకు అవసరమైనపుడు అందలమెక్కించటం తరువాత పక్కకు నెట్టేయటంలో ఇతర పార్టీలకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి తీసిపోదన్నది అనేక చోట్ల రుజువైంది. రెండవది ఉమా భారతికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. తానే ఒక పెద్ద బిసి నేతగా ప్రచారం పొందారు. ఆమె బిజెపి నుంచి వేరుపడినపుడు మోడీని వినాశ పురుష్ అని వర్ణించారు. పదేండ్ల తరువాత ఉమా భారతి వ్యతిరేకులు ఆ వీడియోను ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చారు. తాను అలా అన్నది నిజమే అని, అప్పుడు పార్టీలో లేనని ఉమాభారతి అంగీకరించారు. ‘అతను నాకు 1973 నుంచీ తెలుసు. అతను వికాస పురుషుడు కాదు వినాశ పురుషుడు. జిడిపి వృద్ధి గురించి దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారిని ఎగువకు తెచ్చానని అతను చెప్పుకుంటున్నది బూటకం.గుజరాత్‌లో రాముడు లేడు రోటీ లేదు. వినాశ పురుషుడి బారినుంచి దాన్ని విముక్తి చేయాలి. మీడియా అతన్ని పెద్దగా చేసింది’ అని మోడీ గురించి చెప్పారు. ఇవన్నీ తెలిసిన నరేంద్ర మోడీకి ఆమె పట్ల సానుకూలత లేకున్నా బిసిల ఓట్ల కోసం మంత్రి పదవి కూడా ఇచ్చారు.

ఇక ఉమా భారతి సన్యాసం సంగతి చూద్దాం. గతేడాది నవంబరు ఆరవ తేదీన దాని గురించి ఆమే చెప్పారు. నవంబరు పదిహేడవ తేదీ నుంచి తనను కేవలం దీదీ మా (అక్కమ్మ) మాత్రమే పిలవాలని కోరారు. ఎందుకంటే 1992 నవంబరు 17న సన్యాసం తీసుకున్నపుడు ఆమె పేరును ఉమశ్రీ భారతిగా మార్చారు. అప్పటికే ఎంపిగా ఉమా భారతి పేరుతో ఉన్నందున తరువాత కూడా అదే కొనసాగింది. దీక్ష పుచ్చుకున్న వెంటనే అయోధ్యకు జనాన్ని సమీకరించే పని అప్పచెప్పారు. తరువాత డిసెంబరు ఆరవ తేదీ ఉదంతం చోటు చేసుకుంది. అమరకాంతక్ నుంచి తాను అయోధ్య వెళ్లానని బాబరీ మసీదు కూల్చివేత తరువాత అద్వానీతో పాటు తననూ అరెస్టు చేసి జైల్లో పెట్టారని అన్నారు. మూడు దశాబ్దాల తరువాత ప్రస్తుత గురువు విద్యాసాగర్ జీ మహరాజ్ ఇచ్చిన సలహా మేరకు అక్కమ్మగా పిలవాలన్నారు.

ఆ రోజు నుంచి తనకు మొత్తం ప్రపంచం ఒకటే అని కుటుంబం, బంధువులు ఎవరితోనూ ఎలాంటి బంధాలు ఉండవు అన్నారు. (లోధీ సామాజిక తరగతి సభకు ఎందుకు వెళ్లినట్లు, రాజకీయాలు ఎందుకు మాట్లాడినట్లు) తాను ప్రతి ఒక్కరికీ దీదీ మాను మాత్రమే అన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, కానీ ప్రజా జీవనం, రాజకీయ జీవనంలో క్రియాశీలంగానే ఉంటానని కూడా చెప్పారు. బహుశా దాని కొనసాగింపుగానే ఇప్పుడు కొత్తగా అక్కమ్మకా మారిన తరువాత రాముడు, హనుమంతుడి పేరుతో సరికొత్త రాజకీయానికి తెర లేపినట్లు భావించాలా ? గతంలో యోగులు, యోగినులు అడవులు, ఆశ్రమాలకు పరిమితం కాగా, ఇప్పటి వారు అధికారం చుట్టూ తిరుగుతున్నారు. జనాల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News