ఉమ్రాన్ మాలిక్ ఐపిఎల్ అరంగేంట్రంపై తండ్రి భావోద్వేగం
శ్రీనగర్: ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తరఫున జమ్మూ, కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపిఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ 150.03 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. 21 ఏళ్ల ఈ క్రికెటర్ సాధారణ కుటుంబంనుంచి ఈ స్థితికి చేరుకున్నాడు. ఇతని తండ్రి కూరగాయలు, పండ్ల వ్యాపారి. తన కుమారుడు ఐపిఎల్ అరంగేట్రం చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని, ఆనందంతో కళ్లనుంచి నీళ్లు వచ్చాయని ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ మాలిక్ చెప్పాడు.
‘ నా కుమారుడికి చిన్ననాటినుంచి క్రికెట్ అంటే ఆసక్తి. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కలలు కనే వాడు. సన్‌రైజర్స్ తరఫున ఐపిఎల్‌లో అరంగేట్రం చేయడంతో చాలా సంతోషించాం. మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీవీకి అతుక్కుపోయాం. నాకు, నా భార్యకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు. మాది చాలా పేద కుటుంబం. నేను పండ్లు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా కుమారుడు మేము గర్వపడేలా చేశాడు. మా ఆనందానికి అవధులు లేవు. లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉమ్రాన్‌ను అభినందించారు. ఏదో ఒక రోజు అతడు ఇండియాకు ఆడతాడనే నమ్మకం ఉంది’ అని అబ్దుల్ మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.