ప్రపంచానికే గొప్ప ఆస్తి భారత్ అని ప్రశంస
న్యూయార్క్ : భారత్ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం ప్రపంచానికే పెద్ద ఆస్తిగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రశంసించారు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పీడిస్తున్న సంక్షోభంలో అనేక దేశాలకు భారత్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందచేస్తోందని ఇప్పటివరకు 55 లక్షల డోసులను వివిధ దేశాలకు బహుమానంగా పంపిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ కీలక పాత్ర వహించగలదన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు.
ఇప్పటివరకు అందుబాటు లోకి వచ్చిన వ్యాక్సిన్ తయారీ లైసెన్సులను ఆయా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటివరకు భారత్ విమానాల ద్వారా ఆరు మిలియన్ వ్యాక్సిన్ల డోస్‌లను తొమ్మిది దేశాలకు మొదటి దఫా వ్యాక్సిన్ మైత్రి కింద పంపించిందని, క్రమంగా ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన కొవాక్స్ సౌకర్యానికి కూడా సరఫరా చేయనున్నట్టు భారత్ చెప్పిందని వివరించారు. త్వరలో కరీబియన్ దేశాలతోపాటు ఒమన్, నికరాగ్వా, పసిఫిక్ ద్వీప దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు.