న్యూయార్క్: మయన్మార్‌లో సైన్యం భద్రతామండలి విజ్ఞప్తులను కూడా లెక్కచేయకుండా ఆందోళనకారులపై మితిమీరిన హింసాకాండ కొనసాగించడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ భయాందోళనలు వెలిబుచ్చారు. ఆ దేశం మిలిటరీ అణచివేతకు ముగింపు పలకడానికి అంతర్జాతీయ సమాజం సమష్టిగా పనిచేయాలని, ద్వైపాక్షికంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మయన్మార్ సైన్యాన్ని నిగ్రహం పాటించాలని, చర్చలతో తిరిగి దేశంలో ప్రజాస్వామ్య పంధా నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేసినా ఆందోళన కారులను హత్య చేయడం, ఏకపక్షంగా అరెస్టు చేయడం ఇవన్నీ భద్రతా మండలి వినతులను సైన్యం ధిక్కరించినట్టు స్పష్టమౌతోందని అన్నారు. ఈమేరకు గుటెర్రస్ తరఫున అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. మయన్మార్‌లో పరిస్థితిని శాంతపర్చడానికి, చర్చలకు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అనుకూల వాతావరణం నెలకొనేలా ప్రయత్నించడానికి తన ప్రత్యేక దౌత్యప్రతినిధికి మయన్మార్‌ను సందర్శించే అవకాశం ఇవ్వాలని ఆయన మిలిటరీ పాలకులను కోరారు. మయన్మార్ ప్రజలకు వారి ప్రజాస్వామ్య ఆకాంక్షలకు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.