Monday, December 23, 2024

రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో తీర్మానం..

- Advertisement -
- Advertisement -

UN Denied Russia attack on Ukraine

రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో తీర్మానం
ఓటింగ్‌కు గైర్‌హాజరైన భారత్
చర్చలు ఒక్కటే పరిష్కారమార్గమని స్పష్టీకరణ
తీర్మానాన్ని వీటో చేసిన రష్యా

ఐక్యరాజ్య సమితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండడం గమనార్హం. కానీ, తక్షణమే ఉక్రెయిన్‌నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకోవాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేసింది. అమెరికా, అల్బేనియా సంయుక్తంగా రూపొందించిన ఈ తీరానంపై స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం భద్రతా మండలి ఓటింగ్ నిర్వహించింది. పోలండ్, లక్సెంబర్గ్, ఇటలీ సహా 11 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. భారత్, చైనా, యుఎఇలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. తీర్మానం సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ ‘విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు ఒక్కటే సమాధానం. అయితే ఈ క్షణంలో అది కొంత సాధ్యమయ్యే పని కాదనిపించినప్పటికీ తప్పదు. ఇరువర్గాలు దౌత్యమార్గాన్ని వదులుకోవడం విచారించదగ్గ విషయం. మనం తిరిగి ఆ మార్గానికే రావాలి. ఈ కారణాల వల్ల భారత్ ఈ తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది’ అని వివరించారు. ఊహించినట్లుగానే భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న రష్యా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకొంది. మాస్కో వర్గాలు ఈ తీర్మానాన్ని వీగిపోయేలా చేస్తాయని ముందుగానే ఊహించినట్లు అమెరికా తెలిపింది. అయితే, ఈ ఓటింగ్‌ద్వారా అంతర్జాతీయ వేదికపై రష్యా ఒంటరితనాన్ని చూపించగలిగినట్లు పేర్కొంది.

అలాగే ఉక్రెయిన్‌పై పుతిన్ సేనల సైనిక చర్యను ప్రపంచదేశాలు వ్యతిరేకిస్తున్నట్లు నిరూపించగలిగామని వివరించింది. ‘మీరు ఈ తీర్మానాన్ని మాత్రమే అడ్డుకోగలరు. మా గళాన్ని, నిజాన్ని, సిద్ధాంతాలను, ఉక్రెయిన్ ప్రజలను మాత్రం అడ్డుకోలేరు’ అని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్మానంపై ఓటింగ్ విషయంలో భారత్, చైనాలు ఏ వైఖరి తీసుకుంటాయనే అందరి దృష్టీ ఉండింది. అయితే వీటో అధికారం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా చైనా ఓటింగ్‌కు దూరంగా ఉండడం గమనార్హం. భద్రతా మండలిలో తీర్మానం వీగిపోవడంతో ఇప్పుడు జనరల్ అసెంబ్లీలో వీలయినంత త్వరగా ఇదే తరహా తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయింది. జనరల్ అసెంబ్లీలో ఏ దేశానికి కూడా వీటో అధికారం లేదు. అయితే, జనరల్ అసెంబ్లీలో ఎప్పుడు తీర్మానాన్ని ప్రవేశపెడతారనే విషయంపై మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు.

UN Denied Russia attack on Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News