Monday, December 23, 2024

గాజాపై ప్రపంచాభిప్రాయం

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ మృత్యు దాడుల్లో నెత్తురోడుతున్న గాజాలో మానవతా దృష్టితో కూడిన సంధిని సాధించి అక్కడ తక్షణమే శాంతిని నెలకొల్పాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మానం ప్రపంచాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది. మొత్తం 193 సభ్య దేశాల్లో తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 ఓటు వేశాయి. ఇండియా సహా కొన్ని దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అత్యంత శక్తిమంతమైన భద్రతా మండలి ఇంతటి మానవ మహా విషాదం పట్ల కూడా మౌనం పాటించడంతో జనరల్ అసెంబ్లీ రంగంలోకి దిగి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే దీని వల్ల ఎటువంటి ప్రయోజనం వుండదు. కేవలం ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడమే దీని పని. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయ పాలనా వ్యవస్థను ప్రపంచంలో ఆవిష్కరించింది తామేనని చెప్పుకొనే అమెరికా ఈ తీర్మాన సారాంశానికి అనుగుణంగా నడుచుకుంటే గాని గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండ ఆగదు. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.

అంటే పట్టులోని కోడి పిల్లలు దొరికిపోయిన మాదిరిగా వున్న గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లను బాంబు దాడులతో బలి తీసుకోడానికి ఇజ్రాయెల్‌కు పచ్చజెండా ఊపడమే కదా! ఈ నెల 7న హమాస్ చేసిన దానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న గగనతల, భూతల దాడులకు వేలాది మంది పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు 7703 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 3500 మంది పిల్లలే కావడం గమనించవలసిన విషయం. మానవత్వం వున్నవారిని ఈ కఠోర వాస్తవం ఎంతగా శోకంలో ముంచివేస్తుందో, వారి హృదయాలను మరెంతగా కరిగిస్తుందో చెప్పనవసరం లేదు. దాడి చేసిన హమాస్ సభ్యులను గుర్తించి వారిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం శిక్షించడం వేరు, ఇలా సామూహిక జన హననానికి పాల్పడడం వేరు. ఎలుకను చంపడానికి ఇంటిని, ఇంట్లో వున్న వారిని తగలబెట్టడమంటే ఇదే. ‘పౌరులను కాపాడి న్యాయపరమైన, మానవతాయుతమైన బాధ్యతలను నెరవేర్చడం’ అనే శీర్షికతో ప్రతిపాదించిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయకుండా ఇండియా తటస్థ వైఖరిని తీసుకోడానికి అందులో హమాస్ ప్రస్తావన చేయకపోడమేనని తెలుస్తున్నది.

తీర్మానంలో హమాస్ దాడిని కూడా ప్రస్తావించాలంటూ కెనడా ప్రతిపాదించిన సవరణ అవసరమైన మూడింట రెండొంతుల మద్దతు లేకపోడంతో వీగిపోయింది. ఈ సవరణకు అనుకూలంగా ఓటు వేసిన 87 దేశాల్లో ఇండియా కూడా వుంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన ముష్కర దాడిలో 1400 మంది ఇజ్రాయెలీలు దుర్మరణం పాలైన మాట వాస్తవం. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో అంతకంటే అనేక రెట్లు ప్రజలు చనిపోతున్నారు. అంతేకాదు ఆనాటి హమాస్ దాడికి పాలస్తీనాను అదే పనిగా ఆక్రమించుకొంటూ అక్కడి ప్రజలకు ఊపిరి ఆడకుండా చేస్తున్న ఇజ్రాయెల్ దురాక్రమణే కారణమన్నది కూడా తెలిసిందే. అందుచేతనే ఈ సమస్య తలెత్తినప్పటి నుంచి భారత దేశం పాలస్తీనియన్లకు గట్టి మద్దతు ఇస్తూ వచ్చింది. ఈ చారిత్రక మానవీయ వైఖరికి ప్రధాని మోడీ ప్రభుత్వం మొదటిసారిగా ఇంత బాహాటంగా స్వస్తి చెప్పడం అత్యంత బాధాకరం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని 22 అరబ్ దేశాలు కలిసి రూపొందించాయి. ఆయిల్ సంపన్నమైన ఈ దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయన్న దృష్టి కూడా లేకుండా ఇండియా ఎందుకు తటస్థ వైఖరి వహించింది అనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది.

తీర్మానంపై ఓటింగ్‌కు ముందు జోర్డాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడమంటే ఇప్పుడు గాజాలో సాగుతున్న మతిలేని మారణ హోమాన్ని ఆమోదించడమే కాగలదని అన్నారు. తటస్థ ఓట్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఇజ్రాయెల్ తనకు ఆకలి వేసినప్పుడల్లా పాలస్తీనియన్ పసి పాపలను చంపి ఆరగించడం ఇలా ఎంత కాలం సాగుతుందో? 1967లో ఇజ్రాయెల్‌కు అరబ్ దేశాలకు మధ్య జరిగిన ఆరు రోజుల యుద్ధంలో పాలస్తీనియన్ల భూభాగాలైన గాజా ముక్కను, వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ ఆక్రమించుకొన్నది. అందులో భాగంగా తూర్పు జెరూసలెం కూడా దాని వశమైంది. ఈ సందర్భంగా కనీసం 5 లక్షల మంది పాలస్తీనియన్లు అక్కడి నుంచి తరలిపోయారు. హమాస్‌కు ఇజ్రాయెల్‌కు ఇంత వరకు ఐదు సార్లు ప్రత్యక్ష ఘర్షణలు జరిగాయి. మధ్య మధ్యలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ జరుపుతున్న ఒక మాదిరి హింసాత్మక దాడులు మామూలే. ఒకప్పుడు ఆ ప్రాంతంలో నిష్పూచీగా నివసించిన పాలస్తీనియన్లను క్రమక్రమంగా కాళ్ళకింద అంగుళమైనా నేల లేని నిర్భాగ్యులుగా మార్చడమే అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్షమైతే దానిని మానవాళి ప్రతిఘటించి తీరాలి. అది జరగాలనేదే ప్రతి ఒక్కరి కల.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News