Wednesday, January 22, 2025

ఐరాస వేదికపై ఇజ్రాయెల్, పాలస్తీనా వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ఇజ్రాయెల్, పాలస్తీనా రాయబారులు తమ వాదనలను బలంగా వినిపించారు.తమ దేశంపై జరుగుతున్న దాడులను ప్రపంచం ఎదుట ఉంచడానికి ప్రయత్నించారు. గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని, బందీలను సురక్షితంగా విడుదల చేయాలని జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై శుక్రవారం ఓటింగ్ సందర్భంగా చర్చ జరిగింది. చర్చపై ఇజ్రాయెల్ స్పందించింది. చర్చలో పాల్గొన్న ప్రతి దేశ ప్రతినిధి కూడా కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ అరబ్ దేశాల మద్దతుతో ప్రవేశ పెట్టిన ఈ తీర్మానాన్ని సమర్థించాయి. అయితే ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ మాత్రం కాల్పుల విరమణకు ఇచ్చే ఏ పిలుపైనా శాంతి నెలకొనేదానికి కాదని, ఇజ్రాయెల్ చేతులు కట్టేయడమే అవుతుందని తమ పౌరులకు పెనుముప్పుగా పరిణమించిన హమాస్ దుష్టశక్తులను అంతమొందించకుండా అడ్డుకుంటుందని అన్నారు. హమాస్ అక్టోబర్ 7న తమ దేశంపై జరిపిన మారణ కాండను ఆయన ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఐరాసలోని సభ్యదేశాల ప్రతినిధులకు క్యుఆర్ కోడ్‌తో ఉన్న ఓ షీట్‌ను ఇచ్చింది. దీనిని స్కాన్ చేయగా హమాస్ అక్టోబర్ 7న జరిపిన పాశవిక దాడుల దృశ్యాలు వచ్చాయి. అదే సమయంలో ఎర్డాన్ ఐరాస వేదికపై ఎర్డాన్ ప్రసంగిస్తూ తన ట్యాబ్‌లోని ఓ దృశాన్ని సభకు చూపించారు. దీనిలో ఓ థాయిలాండ్ కార్మికుడిని హమాస్ ఉగ్రవాదులు చంపేసి అతని శరీరీన్ని ఛిద్నం చేసే దృశ్యాలు ఉన్నాయి.‘ నేను గత కొన్ని వారాలుగా ఇలాంటి టేపులను చాలా చూశాను. అవి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తీవ్రంగా గాయపడిన పౌరుడిపై హమాస్ ఉగ్రవాది దాడి చేయడాన్ని మీరు చూడవచ్చు. అతడు థాయిలాండ్‌నుంచి వచ్చిన వ్యవసాయ కార్మికుడు. యూదుడు కాదు.ఆ వ్యక్తి మరణంతో పోరాడుతోంది. ఉగ్రవాదులు అమానుషంగా, భయంకరంగా ప్రవర్తించారు. హమాస్ ఉగ్రవాదులు కంటికి కనిపించిన ప్రతిప్రాణిని చంపారు. ఇది పాలస్తీనా వాసులపై యుద్ధం కాదు. హమాస్ ఉగ్రవాదంపై యుద్ధం’ అని ఎర్డాన్ సభకు చెప్పారు. కాగా అంతకు ముందు పాలస్తీనా ప్రతినిధి రియాద్ మన్సూర్ మాట్లాడుతూ గాజా ముట్టడిలో ఇజ్రాయెల్ పాలస్తీనా వాసులను చంపుతోందని ఆరోపించారు.

ఆస్పత్రులు పని చేయడం లేదన్నారు.‘ కన్నీరు పెట్టుకోవడానికి కూడా సమయం లేదు. మరిన్ని మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పాలస్తీనా వాసుల హత్యలకు ఇజ్రాయెల్ వాసుల హత్యలు సమాధానం కాదు.అలానే ఇజ్రాయెల్ వాసుల హత్యలకు పాలస్తీనా వాసులను చంపడం జవాబు కాదు. కానీ కొందరు ఇజ్రాయెల్ వాసులకోసం ఎక్కువ బాధపడతారు… మా( పాలస్తీనా) కోసం తక్కువ బాధపడతారు. గాజాలో పలు యుద్ధాలను తట్టుకుని జీవించిన వారిని ఇప్పుడు చంపుతున్నారు’ అని రియాద్ తమ వారి ఆవేదనను సభకు వినిపించారు. 22 దేశాల అరబ్ గ్రూపు తరఫున జోర్డాన్ విదేశాంగ మంత్రి అయమన్ సఫాది మాట్లాడుతూ ఇజ్రాయెల్ బాంబుల దాడితో కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిన్నారులు చనిపోతున్నారని, కొంతమంది శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నప్పటికీ వారిని బైటికి తీసేందుకు ఎలాంటి పరికరాలు లేవని ఉద్వేగంగా అన్నారు. ఈ యుద్ధంలో జీవితాలు ఛిద్రమవుతున్న పాలస్తీనియన్ల గురించి ఎర్డాన్ తన ప్రసంగంలో ఒక్క మాట కూడా మాట్లాడక పోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ చట్టాలకు ఇజ్రాయెల్ అతీతం కాదని ఆయన అన్నారు. ఆత్మ రక్షణ హక్కు అనేది అమాయకులను చంపేందుకు లైసెన్స్ కాదని అన్నారు.

జోర్డాన్ మంత్రి అమెరికా, దాని మిత్ర దేశాలను పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ దేశాలు ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధాన్ని సమర్థించడం ద్వారా దానికి మద్దతు ఇస్తున్నాయని మాలో చాలా మంది నమ్ముతున్నారని అన్నారు. తీర్మానంపై చర్చ శుక్రవారం తిరిగి ప్రారంభమవుతుంది. భద్రతా మండలిలాగా కాకుండా జనరల్ అసెంబ్లీలో వీటోలు ఉండవు. అలాగే ఇక్కడ చేసే తీర్మానాలకు కట్టుబడి ఉండాలిన అవసరం కూడా ఉండదు. అయితే తీర్మానం ఆమోదం పొందిన తీరును బట్టి ప్రపంచ దేశాల అభిప్రాయం ఎలా ఉందనేది తెలుస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News