శ్రీశైలంకు 3.32లక్షల క్కూసెక్కులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లోకి గణనీయంగా వరదనీటి చేరికలతో ప్రాజ్కెక్టుల వద్ద అధికారులు ముందు జాగ్రత్త చర్యల కింద వరద నియంత్రణ చర్యలు చేపట్టారు. జూరాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,13,305క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా ప్రాజెక్టు నుంచి దిగువకు 2,04,520క్యూసెక్కుల నీటిని వదలిపెడుతున్నారు. అటు తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా 37,477క్యూస్కెక్కుల నీరు చేరుతుండగా ,అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
సుంకేసుల బ్యారేజి వద్ద ఎగువ నుంచి 41,153క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా, బ్యారేజి గేట్లు తెరిచి అంతే నీటిని దిగువ నదిలోకి వదలిపెడుతున్నారు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వదరనీరు చేరుతోంది. ఎగువ నుంచి 3,32,822క్యూసెక్కుల నీరు చేరుతుండగా , రిజర్వాయర్ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా బయటకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,50,197క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 2,92,114క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి 2,82,633క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,వచ్చిననీటిని వచ్చినట్టుగా ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 2.48లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతోంది. బ్యారేజి గేట్లు తెరిచి దిగువన నిదిలోకి వచ్చిననీటిని వచ్చినట్టుగా వదిలిపెడుతున్నారు.
శ్రీరాంసాగర్‌కు 1.22లక్షల క్యూసెక్కులు:
గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,22,672క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉంది. నీటి నిలువ కూడా 90.31టిఎంసీల మేరకు ఉండటంతో అధికారుల ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా రిజర్వాయర్ నుంచి బయటకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,70,884క్యూసెక్కులు ఉండగా ,ఔట్‌ప్లో కూడా అంతే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.