Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారులను బిఆర్‌ఎస్ విస్మరించింది
ఆనాడు చట్టసభల్లో తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ ఎంపిలే
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్‌లో మోతే శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి శ్రీలత శోభన్ రెడ్డి మంచిపనిచేశారని ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బిఆర్‌ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని ఆయన హామినిచ్చారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిందని ఆయన తెలిపారు. ఆనాడు చట్టసభల్లో తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ ఎంపిలేనని ఆయన అన్నారు. ఎప్‌డిఐపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు తాము ఓటెయ్యమని చెప్పామన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తాము ఓటేస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. సుష్మాస్వరాజ్ ను తాము ఒప్పించి బిల్లుకు మద్దతు పలికేలా చేశామన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే సందర్భాన్ని లైవ్ టెలికాస్ట్ ఇవ్వొద్దని ఐబి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గొడవలు జరుగుతాయని తప్పుడు నివేదిక ఇవ్వడంతో లైవ్ ఇవ్వలేదని మంత్రి పొన్నం వివరించారు. ప్రాసెస్ ప్రకారమే బిల్లు ప్రవేశపెట్టే సమయంలో చట్ట సభలో సభ్యులు బయటకు, లోపలికి తిరగకుండా తలుపులు మూస్తారని ఆయన తెలిపారు. కానీ, ప్రధాని మోడీ తలుపులు వేసి బిల్లు ప్రవేశపెట్టారని చెప్పడం సరికాదని పొన్నం పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News