Wednesday, January 22, 2025

మమత అఖిలపక్షం సశేషం

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి అభ్యర్థిపై ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రపతి రేసుకు పవార్ నో
తెరపైకి గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా పేర్లు
21న మరోసారి సమావేశానికి నిర్ణయం

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో విపక్షాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చాయి. పార్టీలకు అతీతంగా ఒక్కరిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని విపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని కానిస్టూషన్ క్లబ్‌లో జరిగిన సమావేశం అనంతరం విపక్ష నేతలు ప్రకటించారు.అభ్యర్థిపేరు ఖరారు కోసం ఈ నెల 21న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి. రాష్ట్రపతి రేసులో దిగేందుకు ఎన్‌సిపి నేత శరద్ పవార్ నిరాకరించడంతో మమతా బెనర్జీ మరో ఇద్దరి పేర్లను సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు పవార్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉంటారంటూ కొనసాగిన ఊహాగానాలకు ఈ భేటీలో తెరపడినట్లయింది. మమత ప్రతిపాదనకు పవార్ నో చెప్పడంతో ఆమె బెంగాల్ మాజీ గవర్నర్, గాంధీజీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తొలుత విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ పేరును మమత ప్రతిపాదించగా తాను ఇంకా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాల్సి ఉందని చెప్తూ ఆయనఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

‘ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని, ఉమ్మడి అభ్యర్థిగా ఉండాలని అన్ని పార్టీల నేతలు శరద్ పవార్‌ను అభ్యర్థించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు’ అని సమావేశం అనంతరం డిఎంకె నాయకుడు టిఆర్ బాలు విలేఖరులకు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి విషయమై బిజెపియేతర పార్టీలతో మల్లికార్జున ఖర్గే, పవార్, మమతలు చర్చలు జరపాలని కొంత మంది నేతలు సూచించినట్లు ఆయన చెప్పారు. అయితే తమ ప్రతిపాదనపై పునరాలోచించాలని నేతలు పవార్‌ను కోరాలని, ఎందుకంటే ఆయనే సరయిన అభ్యర్థి అని ఆర్‌జెడి నేత మనోజ్ ఝా అన్నారు. కాగా అందరికీ ఆంగీకారమైన ఒకే ఒక అభ్యర్థి మాత్రమే ఉండాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమయినట్లు సిపిఐకి చెందిన బినయ్ విశ్వమ్ చెప్పారు.

ఈ సందర్భంగా మమత మీడియాతో మాట్లాడుతూ ‘అన్ని ప్రతిపక్షాలను ఆహ్వానించాం. కొన్ని పార్టీలు హాజరయ్యాయి. మరికొన్ని పార్టీల నేతలు బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం ఉండాలని కోరాను. శరద్‌పవార్ పేరును ప్రతిపాదించాను.విపక్షాలన్నీ ఆయన పేరునే ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. అయితే పోటీకి ఆయన ఆసక్తిగా లేరు. శరద్ పవార్ ఒప్పుకోకపోతే మరోసారి సమావేశమై చర్చిస్తాం. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ఇది మంచి శుభారంభం. కొన్ని నెలల తర్వాత కలిసి ఇలా సమావేశమయ్యాం. మళ్లీ సమావేశమవుతాం. ప్రజాస్వామ్య దేశంలో బుల్డోజింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రతి వ్యవస్థనుదుర్వినియోగం చేస్తున్నారు’ అని అన్నారు.

కాగా ఈ రోజు జరిగిన సమావేశానికి కాంగ్రెస్, ఎన్‌సిపితో పాటుగా శివసేన, సిపిఐ, సిపిఎం,సిపిఐ(ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, జెడి(ఎస్), ఆర్‌ఎస్‌పి, ఆర్‌ఎల్‌డి, జెఎంఎం సహా మొత్తం 17 పార్టీలనేతలు హాజరయ్యారు. అయితే ఆమ్ ఆద్మీపార్టీ, టిఆర్‌ఎస్, శిరోమణి అకాలీద్ పార్టీలు మాత్రం సమావేశానికి దూరంగా ఉండిపోయాయి.

నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం: ఖర్గే

కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి విషయంలోప్రతిపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావడానికి కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా పని చేస్తుందని సమావేశం అనంతరం ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఏ అభ్యర్థి మనసులో లేరని ఆయన స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి రావడానికి తమ పార్టీ మిగతా పార్టీలతో కూర్చుని చర్చిస్తుందని కూడా ఆయన చెప్పారు.

విపక్ష నేతలకు రాజ్‌నాథ్ ఫోన్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పేరును సాధించడానికి అధికార బిజెపి విపక్షాలతో చర్చల ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ విషయమై ఇతర పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను పార్టీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలకు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు నేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి ఎవరో చెప్పాలని వీరంతా రాజ్‌నాథ్‌ను అడిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News